హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025 ’ ఈసారి ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిద్ధారెడ్డి ( Sidha Reddy) కి దక్కడం పట్ల, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నందిని సిద్ధారెడ్డిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి ‘ అనిమేష’ ( Animesha ) కు ఈ అవార్డు రావడం గొప్ప విషయమని అన్నారు. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన తెలంగాణ గర్వించదగ్గ కవి, నందిని సిధారెడ్డి అని కొనియాడారు.
మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి, అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని, గళాన్ని విప్పారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట, సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ, ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిధారెడ్డి చూరగొన్నారని పేర్కొన్నారు.