హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్య పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 22ఏ జాబితాలో భూమి ఉన్నదనే కారణంతో రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరసరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సమీక్షించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ సంబంధిత భూమి 22ఏ నిషేధితజాబితాలోకి ఎందుకు వచ్చింది? అందుకు సంబంధించిన రికార్డులు ఏం చెప్తున్నాయి? ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటి? హకుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి? గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలు ఏమిటి? వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.