నిజాంసాగర్, ఆగస్టు 19: నాగుమడుగు ఎత్తిపోతల పథకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువనున్న మంజీరా నదిలోని నీటిని వృథాగా వెళ్లకుండా సద్వినియోగం చేసుకుంటూ నాన్ కమాండ్ ఏరియాకు సాగు నీరు అందించాలన్న ఉద్దేశంతో 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. భారీ వర్షాలు కురిసిన సమయంలో నిజాంసాగర్ నీటిని మంజీరాలోకి విడుదల చేస్తారు. అలాగే నల్లవాగు మత్తడి చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లుతూ మంజీరాలోకి ప్రవహిస్తుంటాయి. దీంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం నీటిని నిజాంసాగర్‌లోకి మళ్లింపు చేపట్టారు.
అవసరమైతే కాళేశ్వరం నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేసి, ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా మంజీరాలోకి పంపించి, నాగమడుగు మత్తడికి సాగు నీరు అందించడమే లక్ష్యంగా నిర్మాణ పనులు చేపట్టారు. మొత్తం రూ.476 కోట్లతో చేపట్టిన ఈ పథకం ద్వారా నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బిచ్కుంద, మండలాల్లోని 40వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజాంసాగర్ మండలంలోని ఒడ్డెపల్లి, జక్కాపూర్, మల్లూర్, కొమలంచ, గ్రామాల శివారులో ఉన్న మంజీరా నదిలో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. నదిలో అడ్డుగోడ నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 15 శాతం పనులు పూర్తవగా, రూ.60 కోట్ల వరకు బిల్లులు చెల్లించారు. నాన్‌కమాండ్ ఏరియాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా మంజీరా నదిపై నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కరకట్టలు, పంపుహౌస్‌ల నిర్మాణం, పైపుల తవ్వకం పనులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రైతులు తమ భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు.
ముంపు రైతుల ఆందోళన
మంజీరా నదిలో అడ్డుగోడతోపాటు నదికి రెండు వైపులా కర కట్ట, పంపుహౌస్‌ల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటుపై ఎత్తిపోతల పథకం సమీపంలోని భూముల రైతులు ఆందోళన చెందుతున్నారు. నదిలో రెండువైపులా కరకట్టలను 6 నుంచి 9 మీటర్ల ఎత్తులో నిర్మించనుండడంతో సాగు భూములు ముంపునకు గురవుతాయని చెబుతున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణంలో 300 ఎకరాల భూములు మంపునకు గురవుతుండగా, ప్రభుత్వం ఎకరాకు రూ.17 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నది. అయితే ఎకరాకు రెట్టింపు పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. దీంతో భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనికి తోడు ఏడాది నుంచి పనులు కూడా నిలిచిపోయాయి. మత్తడి నిర్మాణానికి సుమారు 300 ఎకరాలు అవసరం కాగా, ఇప్పటి వరకు కేవలం 32 ఎకరాలు మాత్రమే సేకరించారు. భూ సేకరణ కోసం నిధులు కూడా రావడం లేదని తెలిసింది.
నిర్మాణం పూర్తయితే 40వేల ఎకరాలకు సాగునీరు
నాగమడుగు మత్తడి నిర్మాణ పనులు పూర్తయితే నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బిచ్కుంద మండలాల్లో 40,760 ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఇందుకోసం రెండు స్టేజ్ల్లో పంపింగ్ హౌస్‌ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందులో వొడ్డెపల్లి వద్ద ఫస్ట్ స్టేజ్, పిట్లంలోని పెద్ద చెరువు రెండో స్టేజ్. ఈ రెండు స్టేజ్‌ల ద్వారా ఆయా మండలాల్లోని ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నదే పథకం లక్ష్యం. మొదటి స్టేజ్ 9.5 కిలో మీటర్లు, రెండో స్టేజ్‌లో 4. 5 కిలో మీటర్లు పనులు చేపట్టాల్సి ఉన్నది.
‘ఎత్తిపోతల’ పూర్తయితదని నమ్మకంలేదు..
నాగమడుగు మత్తడి నిర్మాణ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా మారాయి. పనులు పూర్తయితే పిట్లం మండలం సస్యశ్యామలమవుతుందని సంతోషించాం. కానీ అది నెరవేరుతుందనే భరోసా లేదు. ఎత్తిపోతల పథకానికి మొత్తం 300 ఎకరాల భూములు అవసరం ఉంటే ఇప్పటివరకు పది శాతం మాత్రమే సేకరించారు. అధికారులు రైతులకు స్పష్టమైన వివరాలు వెల్లడించాలి. ఐదేళ్లుగా ఎలాంటి పనులు పూర్తికాలేదు.
-శశికాంత్, రైతు, చిన్నకొడప్గల్
ఎంతో సంబురపడ్డాం..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన నాగమడుగు మత్తడి పనులు త్వరగా పూర్తయి సాగు నీరు అందుతుందని మేము ఎంతో సంబురపడ్డాం. కానీ ఇంతవరకూ పనులు పూర్తికాలేదు. పనులు పూర్తయితే మాకు సాగునీటి ఇబ్బందులు ఉండవు. ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది.భూగర్భజలాలు సైతం పెరుగుతాయి. నాగమడుగు మత్తడి నిర్మాణం పూర్తయితే నాన్ కమాండ్ ఏరియా మొత్తం సాగులోకి వస్తుందని ఆశ పడుతున్నాం.
-హస్రాద్, రైతు, దేవీసింగ్తండా
సర్వే కోసం ప్రతిపాదనలు పంపించాం
నాగమడుగు మత్తడి నిర్మాణం కోసం సుమారు 300 ఎకరాల భూ సేకరణ జరగాల్సి ఉంది . మత్తడి నిర్మాణంతో భూము లు ముంపునకు గురవుతాయని రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మత్తడి ఎత్తు తగ్గించాలా, లేక రబ్బర్ డ్యాం నిర్మించాలా.. ఒకవేళ ఎత్తు తగ్గిస్తే అనుకున్నత ఆయకట్టుకు సాగు నీరు అందించగలుగుతామా అనే అంశాలపై నిపుణులతో సర్వే చేయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
-కిమ్యానాయక్, ఈఈ నీటి పారుదల శాఖ