spotify wrapped 2022 | భారతీయులు సంగీత ప్రియులు. రోజూ ఒక్కపాటైనా వినకుండా నిద్రపోరంటే అతిశయోక్తి కాదు. అసలు మన వాళ్లకేం నచ్చుతున్నాయి, ఈ ఏడాది ఎవరి పాటలు ఎక్కువగా విన్నారు? అనే సంగతుల్ని వెల్లడించింది ప్రముఖ మ్యూజిక్ యాప్ స్పాటిఫై. అందులో టాప్ లిస్ట్‌లో ఏ పాటలుఉన్నాయి, ఏ పోడ్కాస్ట్లు మురిపించాయి? అనే ప్రశ్నకు జవాబు..
అర్జీత్ సింగ్… పాటలు జనానికి ఎప్పుడూ హాట్ ఫేవరెట్లే. అందుకే వరుసగా మూడో ఏడాదీ ఎక్కువ మంది విన్న పాటలు పాడిన గాయకుడిగా ముందు వరుసలో నిలిచాడు అర్జీత్. తర్వాతి స్థానంలో ‘బ్రహ్మాస్త్ర’ సంగీత దర్శకుడు ప్రీతమ్ చక్రవర్తి పాటలున్నాయి. మూడో స్థానం ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఎ.ఆర్.రెహమాన్‌కు దక్కింది. ఆ తర్వాత ‘అరబిక్ కుతు’ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ పాటల్ని బాగా ఎంజాయ్ చేశారట. పాన్ ఇండియా గాయని శ్రేయా ఘోషాల్ ఈ వరుసలో ఐదో స్థానంలో ఉన్నారు. ఇక, అత్యధికంగా విన్న పాటల వరుసలో ఎ.పి.ధిల్లాన్ పాడిన ‘ఎక్స్క్యూజెస్’ పాటను 19 కోట్ల సార్లు విన్నారు. దీంతో ఎక్కువగా విన్న పాటల జాబితాలో ఇది తొలిస్థానంలో ఉంది. తర్వాత షేర్గిల్, అలీ సేథీల ‘పసూరి..’పాట రెండో స్థానంలో, బ్రహ్మాస్త్రలోని కేసరియా పాట మూడో స్థానంలోనూ ఉంది. పంజాబీ పాప్ సింగర్ శుభ్ పాడిన ‘నో లవ్’, ఆదిత్య గానం చేసిన ‘చాంద్ బాలియన్’ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది హత్యకు గురైన పంజాబీ ర్యాపర్ సిద్ధు మూసేవాలా ఆల్బమ్ ‘మూసెటేప్’ అతి ఎక్కువ సార్లు ప్లే అయిన ఆల్బమ్‌గా నిలిచింది. ఇక, ప్రపంచవ్యాప్తంగా పోడ్కాస్ట్ల శకం నడుస్తున్నది కాబట్టి ఇండియా కూడా ఆ బాటలోనే ముందుకుపోతున్నది. మన దగ్గర ఎక్కువ మంది విన్న పోడ్కాస్ట్గా లీజా మంగళ్‌దాస్ రూపొందించిన ‘ద సెక్స్ పోడ్కాస్ట్’ మొదటి స్థానంలో నిలిచింది. ‘మిత్‌పట్ పోడ్కాస్ట్”, ‘ద రణ్వీర్ షో’, ‘చాణక్య నీతి’, ‘ఆన్ పర్పస్ విత్ జయ్ శెట్టి’ తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
Meera Rajput | స్టార్ హజ్బెండ్ అని ఎవరూ అనరు.. మరి స్టార్ వైఫ్ అనడం దేనికి? : మీరా రాజ్‌పుత్