కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టాలీవుడ్ (Tollywood) యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ తొలిసారి నేరుగా తెలుగులో చేస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. తెలుగులో సార్ (Sir), తమిళంలో వాథి (Vaathi) అనే టైటిల్స్ తో రాబోతుంది. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. సార్ చిత్రం నేటి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. తొలి షెడ్యూల్ షూటింగ్ ఇవాళ మొదలు కానుంది.
పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ షురూ కానుండగా.. ఓపెనింగ్ షెడ్యూల్ పార్టులో ధనుష్ పాల్గొననున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మన దేశంలోని విద్యావ్యవస్థలోని పలు అంశాలను లేవనెత్తుతూ ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఇప్పటికే టైటిల్ లుక్ ఇంట్రడక్షన్ వీడియోతో సినిమా ఎలా ఉండబోతుందో చూపించాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ధనుష్ మరోవైపు శేఖర్ కమ్ములతో బైలింగ్యువల్ మూవీ చేయాల్సి ఉండగా..ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది.
సినిమా హీరోయిన్ ఎవరనే దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఫీ మేల్ లీడ్, ఇతర నటీనటుల వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.