బాలీవుడ్లో విషాదం నెలకొన్నది. సుప్రసిద్ధ నటుడు, దర్శకుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్‌కుమార్ (87) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబయి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మనోజ్‌కుమార్ 1937లో అభివక్త భారత్‌కు చెందిన అబోటాబాద్‌లో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. మనోజ్‌కుమార్ అసలు పేరు హరికృష్ణ గోస్వామి. 1957లో ‘ఫ్యాషన్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన.. ‘కాంచ్ కీ గుడియా’ సినిమాతో నటుడిగా తొలి బ్రేక్‌ని అందుకున్నారు. కాలక్రమంలో దేశభక్తి సినిమాలకు చిరునామాగా నిలిచారు. దాంతో ఆయన్ను అభిమానులు ‘భరత్‌కుమార్’ అంటూ ప్రేమతో పిలుచుకునేవారు. అమితాబ్‌తో ఆయన తెరకెక్కించిన ‘రోటీ కపడా ఔర్ మకాన్’ చిత్రం 1974లో విడుదలై.. ఆ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మనోజ్‌కుమార్ కెరీర్లోనే మెమరబుల్ మూవీ ‘క్రాంతి’. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాక, లెజండరీ యాక్టర్ దిలీప్‌కుమార్‌తో కలిసి నటించి అఖండ విజయాన్ని అందుకున్నారు మనోజ్‌కుమార్.
ఈ సినిమాకు మాటల రచయిత కూడా ఆయనే కావడం విశేషం. ఆయన హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ‘హూ కౌన్ థీ’ ఒకటి. 1964లో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ‘ఆమె ఎవరు?’ పేరుతో రీమేక్ చేశారు. ‘ఉపకార్'(1967), ‘పురబ్ ఔర్ పశ్చిమ్'(1970) వంటి క్లాసిక్స్‌ని ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. 40ఏండ్లకు పైగా సినీ పరిశ్రమకు సేవలందించి, ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి, బాలీవుడ్ అగ్రహీరోలందరితో సినిమాలు రూపొందించి విజయాలను అందుకున్న మనోజ్‌కుమార్‌కి భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 2015లో ఆయన్ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా వరించింది. 1999లో వచ్చి ‘జై హింద్’ ఆయన చివరి చిత్రం.
సుదీర్ఘ కెరీర్లో నటుడిగా, దర్శకుడిగా ఎన్నో అజరామరమైన చిత్రాల్ని అందించారు మనోజ్‌కుమార్. ‘ఉప్కార్’ (1967) దర్శకుడిగా ఆయన తొలి సినిమా. ఇందులో ఆయనే కథానాయకుడు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి పాపులర్ స్లోగన్ ‘జై జవాన్ జై కిసాన్’ స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలను చర్చిస్తూ.. సైనికుడిగా మారిన ఓ రైతు స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి అద్దం పట్టిందీ చిత్రం. ఈ సినిమాకుగాను మనోజ్‌కుమార్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ‘ఉప్కార్’ కంటే రెండేళ్ల ముందుగా వచ్చిన ‘షాహిద్’ చిత్రాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో మనోజ్‌కుమార్ భగత్‌సింగ్ పాత్రను పోషించారు. ఈ సినిమా విజయమే ఆయన్ని దేశభక్తి ప్రధాన చిత్రాల రూపకల్పన వైపుకు నడిపించిందని చెబుతారు.
1974లో వచ్చిన ‘రోటీ కపడా ఔర్ మకాన్’ చిత్రంలో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తించారు మనోజ్‌కుమార్. ఇందులో అమితాబ్ బచ్చన్, జీనత్ అమన్, శశికపూర్ వంటి తారలు భాగమయ్యారు. దేశంలో ఆనాటి నిరుద్యోగం, అవినీతిని చర్చిస్తూ పర్ఫెక్ట్ ఇండియా ఎలా ఉండాలనే సందేశాన్ని అందించింది. ఈ సినిమాలో పాటలన్నీ ప్రజాదరణ పొందాయి.
మనోజ్‌కుమార్ కెరీర్లో బెస్ట్మూవీగా ‘క్రాంతి’ నిలిచింది. దిలీప్‌కుమార్, శత్రుఘ్నసిన్హా, హేమామాలిని, శశికపూర్ వంటి అగ్ర తారలు ఇందులో నటించారు. 19 శతాబ్దం నాటి స్వాతంత్య పోరాటం నేపథ్య కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం కల్డ్ఫిల్మ్గా గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోని అనేక కేంద్రాల్లో సిల్వర్‌జూబ్లీ వేడుకల్ని జరుపుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత ఆనాటి యువత క్రాంతి పేరుతో ఉన్న టీ షర్టులు, బనియన్లు ధరించారంటే సినిమాకు ఎంతటి క్రేజ్ దక్కిందో తెలుసుకోవచ్చు. కెరీర్ ఆరంభంలో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న మనోజ్‌కుమార్ తర్వాత కాలంలో దేశభక్తి ప్రధాన చిత్రాలకు చిరునామాగా నిలిచారు.
1977 ఎమర్జెన్సీ టైమ్‌లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి ఓ సినిమాను తీసేందుకు ప్రయత్నాలు చేశారు మనోజ్‌కుమార్. అయితే రచయితలు సలీమ్-జావెద్‌తో వచ్చిన సృజనాత్మక విభేదాల కారణంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. సాంఘిక చిత్రాలను కూడా చక్కటి విలువలు, సంస్కృతికి పెద్దపీట వేస్తూ తెరకెక్కించారాయన. షాహీద్, వో కౌన్ థీ, హరియాలీ ఔర్ రాస్తా, ఉప్కార్, పురబ్ ఔర్ పశ్చిమ్, గున్మమ్, రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి వంటి చిత్రాలతో ఆయన భారతీయ సినిమాలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశానికే గర్వకారణమైన చిత్రాలను రూపొందించిన మూవీ లెజెండ్ మనోజ్‌కుమార్ మరణం భారతీయ సినిమాకు నిజంగా తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.