ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో పుష్ప ఒకటి. లెక్కల మాస్టారు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇందులో అల్లు అర్జున్, రష్మిక మంధాన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా, రష్మిక గిరిజన యువతి పాత్రలో కనిపించనుందట. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత బన్నీ -సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
పుష్ప చిత్రానికి సంబంధించి ఇటీవల ఇంట్రడక్షన్ వీడియో విడుదల కాగా, ఇది సరికొత్త రికార్డ్ సృష్టించింది. 60 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియోగా నిలిచింది. అయితే పుష్ప సినిమాకు సంబంధించి తాజాగా కొత్త ప్రచారం ఒకటి మొదలైంది. పుష్ప చిత్రాన్ని కూడా బాహుబలి మాదిరిగా రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో తొలి పార్ట్‌ని విడుదల చేసి మరొకటి వచ్చే ఏడాదిలో విడుదల అవుతుందని టాక్. ఇందులో బన్నీ డ్యూయల్ పాత్రలో కనిపించనున్నాడనే టాక్ కూడా నడుస్తుంది. వీటిపై క్లారిటీ రావలసి ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.