బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ప్రపంచనటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ ‘రాజమౌళి వారణాసి’లో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంక.. తాను అనుభవిస్తున్న ఈ స్టార్డమ్ వెనుక పడిన కష్టాన్ని తన తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నది. ‘పరిశ్రమకి వచ్చిన కొత్తలో సినిమాలపై నాకేమాత్రం అవగాహన ఉండేది కాదు. ‘మిస్ వరల్డ్’ అవ్వడంతో అవకాశాలు మాత్రం వరుస కట్టేవి.
అవి రావడమే అదృష్టంగా భావించేదాన్ని. దాంతో వచ్చిన ప్రతి సినిమాకూ సంతకం చేసేదాన్ని. అస్సలు విరామం ఉండేది కాదు. ఈ క్రమంలో పుట్టినరోజులు మిస్ అయ్యాను. పండుగలు, పబ్బాల సంగతి సరేసరి. కుటుంబంతో ప్రశాంతంగా గడిపిన సందర్భాలు వేళ్లతో లెక్కపెట్టుకోవచ్చు. చివరకు మరణశయ్యపై ఉన్న నా తండ్రిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను. ఇలా ఎన్నో త్యాగాలు చేయాల్సొచ్చింది. ఆ త్యాగాలకు ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నా. ఈ స్థానం నా 20ఏండ్ల త్యాగానికి దేవుడిచ్చిన బహుమతి.’ అని చెప్పుకొచ్చారు ప్రియాంక చోప్రా.