Prakash Raj | తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠ రోజురోజుకీ మరింత పెరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు అంశంలో గవర్నర్ వైఖరిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను గవర్నర్ అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఎక్స్ వేదికగా స్పందించిన ప్రకాష్ రాజ్.. గవర్నర్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రవర్తన చాలా అసహ్యకరంగా ఉంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. పైగా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. మనకు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ విజయ్‌కు ప్రజా తీర్పు ఉంది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఆయనకు ఇవ్వాలి అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం టీవీకే పార్టీకి 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతుతో మొత్తం 113 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను విజయ్ గవర్నర్‌కు సమర్పించారు. అయితే రాజేంద్ర అర్లేకర్ మాత్రం పూర్తి సంఖ్యాబలం నిరూపించే 118 మంది మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానం ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరుతూ విజయ్ కొద్దిసేపటి క్రితమే గవర్నర్‌ను కలిసి తన వాదనలు వినిపించారు. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం.
తన వద్ద కావాల్సిన సంఖ్యాబలం ఉందని, ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తే మెజారిటీ నిరూపిస్తానని విజయ్ గవర్నర్‌కు తెలిపినట్లు తెలుస్తోంది. ఒకవేళ గవర్నర్ నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే న్యాయపోరాటానికి వెళ్లేందుకు విజయ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని భారత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తమిళనాడు రాజకీయాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? విజయ్ తదుపరి అడుగు ఏమిటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.