Prakash Raj – Anthahpuram | ప్రకాష్‌రాజ్.. దాదాపు అన్ని భారతీయ భాషల్లో నటించిన నటుడు. ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగల అరుదైన నటుడు. ఆయన పోషించిన ప్రతి పాత్రకు ప్రశంసల జల్లే.. తప్ప ఆయన నటనకు వంక పెట్టిందే వుండదు. తెలుగులో కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నాడు ఈ వెర్సటైల్ ఆర్టిస్ట్. అయితే నటించిన ఎటువంటి సన్నివేశానైనా సింగిల్టేక్లో ఓకే చేయించుకునే ఈ నటుడు ఓ చిత్రంలో ఓ సన్నివేశాన్ని పూర్తిచేయడానికి పద్నాలుగు టేకులు తీసుకున్నాడని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపడాల్సిందే..
ఆయన మాట్లాడుతూ.. ఒక నటుడు కొన్ని పాత్రల ద్వారా అందరికి చేరువకావచ్చు, పేరు సంపాందించుకోవచ్చు. అయితే ఆర్టిస్ట్‌గా సంతృప్తి పడే పాత్రలు, నటుడిగా అతని సత్తా బయటపెట్టే పాత్రలు కొన్ని మాత్రమే వుంటాయి. అలాంటి పాత్రలు పడాలంటే ఒక బాలచందర్, మణిరత్నం, కృష్ణవంశీ లాంటి దర్శకులు కావాలి. ఇలాంటి పాత్రలు పడిన తరువాత మనల్ని మనం ఫ్రూవ్ చేసుకోవాల్సిందే. ప్రతి పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకోవాల్సిందే. నాకు అలా లభించిన క్యారెక్టర్ అంత:పురంలోని నర్సింహా పాత్ర. అందులో తన అల్లుడిని చంపిన వాడి మీద ప్రతికారం తీర్చుకుని, వాడ్ని కసి తీరా చంపి ఇంటికొచ్చి కూతరు ముఖాన బొట్టు చెరిపేసి ఏడ్చే సన్నివేశం ఒకటుంది. ఆ సినిమాలో నేను యాక్ట్ చేసిన మొదటి సన్నివేశం కూడా అదే. నేను ఆ సన్నివేశం మళ్లీ మళ్లీ చేస్తున్నాను. వంశీ మళ్లీ మళ్లీ టేకులు చెబుతున్నాడు. ఆ షాట్ పద్నాలుగు టేకులు చేసిన ఓకే అవలేదు.
బాలచందర్, మణిరత్నం, గొప్ప దర్శకుల సినిమాల్లోనే సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌ని అనే గర్వం నాలో వుంది. నాతో ఒకే సన్నివేశాన్ని ఇన్ని సార్లు చేయిస్తున్నాడు. నా చేత కాదని అంటున్నాడు. నా అహంకారం దెబ్బ తింది. ఇక నా వల్ల కాలేదు. ఏంటీ వంశీ ప్రాబ్లమ్ అన్నాను. ఏంలేదు ఆ సన్నివేశంలో నర్సింహా ఏడవకూడదు. ఎంతో రోషం వున్నా, ఇగో వున్నా.. దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు పగతీర్చుకోలేక పోయినా నర్సింహా పాత్రలోని అసహాయిడు ఏడవాలి. ప్రతీకారం తీర్చుకున్నా, కూతురు పసుపు కుంకుమలు మళ్లీ తీసుకరాలేనని తెలిసి అసహాయిడిగా ఏడవాలి. ఇదీ నాకు కావాలసిన ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఇక నాకు వంశీకి ఏం కావాలో అర్థమయింది. దాంతో తదుపరి షాట్ ఓకే అయింది. ఇది నా కెరీర్లో ఎప్పటికి గుర్తుండే మరుపురాని షాట్ అని చెప్పుకొచ్చారు.
Also Read..
Paris Olympics 2024 | షూటౌట్లో బ్రిటన్‌పై సూపర్ విక్టరీ.. హాకీ సెమీ-ఫైనల్లో భారత్
Harish Rao | ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కారం బువ్వ.. ప్రభుత్వంపై మండిపడ్డ హరీశ్‌రావు