శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 23:24:34

సెట్‌లో సందడి షురూ

సెట్‌లో సందడి షురూ

ప్రభుత్వాలు సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చినా తెలుగు చిత్రసీమలోని అగ్రకథానాయకులు మాత్రం సెట్స్‌లో అడుగుపెట్టాలా?వద్దా? అనే మీమాంసలో చాలా రోజులు ఉండిపోయారు. సెట్స్‌లో భద్రత, సురక్షితంగా షూటింగ్‌లు చేసే విషయంలో రక్షణ చర్యల్ని ఎలా తీసుకుంటారనే సంశయాలు అందరిలో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌ వరకు టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లకు ప్రారంభంకావడం అనుమానమేనంటూ వార్తలొచ్చాయి. కానీ ఆ భయాల్ని పటాపంచలు చేస్తూ స్టార్స్‌ మొదలుకొని చిన్న హీరోలవరకు ఒక్కొక్కరూ తమ సినిమాల చిత్రీకరణల్ని మొదలుపెడుతున్నారు. వైరస్‌ భయాల్ని పక్కనపెట్టి తగిన జాగ్రత్తలతో షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. లాక్‌డౌన్‌ విరామం తర్వాత అగ్రకథానాయకుల్లో  నాగార్జున తొలుత షూటింగ్‌ను మొదలుపెట్టి యువ  హీరోల్లో స్ఫూర్తినింపారు. ఆయన  కథానాయకుడిగా నటిస్తున్న ‘వైల్డ్‌డాగ్‌' సినిమా చిత్రీకరణ ఇటీవల తిరిగి ఆరంభమైంది.  తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో నాగార్జున తనయుడు నాగచైతన్య  ‘లవ్‌స్టోరీ’ షూటింగ్‌లో భాగమయ్యారు. హైదరాబాద్‌లో ఇటీవల ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను దర్శకుడు శేఖర్‌ కమ్ముల మొదలుపెట్టారు. ముందు జాగ్రత్తగా యూనిట్‌ అందరూ కరోనా పరీక్షలు పూర్తిచేసుకున్న తర్వాతే సెట్స్‌లో అడుగుపెట్టారు. కేవలం పదిహేను మంది యూనిట్‌ సభ్యులతో నాయకానాయికలపై హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. 

దాదాపు ఆరు నెలల విరామం తర్వాత తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టారు హీరో సాయితేజ్‌. లాక్‌డౌన్‌ కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన  ‘సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమాను పాటతో తిరిగి మొదలుపెట్టారు. లాక్‌డౌన్‌ విరామాన్ని కుటుంబంతో ఆస్వాదించిన మహేష్‌బాబు మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టి అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. ఇటీవల ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నారాయన. లాక్‌డౌన్‌ విరామం తర్వాత వరుణ్‌తేజ్‌ ఇటీవల ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో పాల్గొన్నారు. 

దర్శకుడు సంపత్‌నంది. కథ, స్క్రీన్‌ప్లే సంభాషణలు అందిస్తూ రూపొందుతున్న ‘ఓదెల  రైల్వేస్టేషన్‌' సినిమా షూటింగ్‌ ఆరంభమైంది. కన్నడ నటుడు వశిష్టసింహా, హెభాపటేల్‌, సాయిరోనక్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.  అశోక్‌తేజ దర్శకత్వం వహిస్తున్నారు.  అలాగే  సంపత్‌నంది కథను అందిస్తున్న మరో చిత్రం ‘బ్లాక్‌రోజ్‌' సినిమా చిత్రీకరణ ఇటీవల ఆరంభమైంది.  ప్రశాంత్‌వర్మ రూపొందిస్తున్న ‘జాంబీరెడ్డి’ చిత్రీకరణ సాగుతోంది. వీరితో పాటు మరికొందరు దర్శకనిర్మాతలు కరోనా వైరస్‌ భయాల్ని పక్కనపెట్టి తమ సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకొచ్చారు.