Mohanlal | జస్టిస్ హేమ కమిటీ (justice hema committee) నివేదిక మాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నివేదిక నేపథ్యంలో మలయాళీ సినీ కళాకారుల సంఘం (Malayalam Movie Artists Association) అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు మోహన్ లాల్ (Mohanlal) రాజీనామా కూడా చేశారు. అయితే, ఆయన మళ్లీ అమ్మ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై మోహన్‌లాల్ తాజాగా స్పందించారు.
ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టతనిచ్చారు. అందులో ఆఫీస్ బాయ్‌గా కూడా చేయడం తనకు ఇష్టం లేదంటూ వ్యాఖ్యానించారు. హేమ కమిటీ రిపోర్టులో బయటపడ్డ విషయాలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. అందుకే మరోసారి అమ్మ అసోసియేషన్‌లో ఎలాంటి బాధ్యతలూ చేపట్టదల్చుకోలేదని స్పష్టం చేశారు. తాము మూకుమ్మడిగా అసోసియేషన్‌లోని పలు పదవులకు రాజీనామా చేయడానికి గల కారణాలు చెప్పాల్సిందిగా అంతా అడుగుతున్నారన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చిత్రపరిశ్రమదేనని మోహన్‌లాల్ స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమలో నటీనటులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను హేమ కమిటీ బయటపెట్టిందని గుర్తు చేశారు. ఈ నివేదిక తర్వాత ప్రతి ఒక్కరూ ‘అమ్మ’నే ప్రశ్నించారని మోహన్‌లాల్ వ్యాఖ్యానించారు.
మలయాళ సినీరంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక అక్కడి ఇండస్ట్రీని కుదిపిసిన విషయం తెలిసిందే. మలయాళ పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులతో పాటు పారితోషికాల్లో వివక్ష, షూటింగ్ లొకేషన్లలో కనీన సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హేమ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో మలయాళీ సినీ కళాకారుల సంఘం అధ్యక్ష పదవికి మోహనల్ లాల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మొత్తం 17 మంది పాలక మండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.
కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ‘అమ్మ’ సంఘంలో సభ్యులుగా ఉన్న దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముఖేష్, సూరజ్ వెంజారమూడులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. వీరితోపాటు పలువురు రాజకీయ నేతలపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ప్రస్తుతం పలువురు ప్రముఖులు విచారణను ఎదుర్కొంటున్నారు.
Also Read..
Sidhu Moose Wala | సిద్ధూ మూసేవాలా సోదరుడిని చూశారా.. ఫొటో వైరల్
Virat Kohli | ముంబై రెస్టారెంట్లో కోహ్లీ – అనుష్క సందడి.. ఫొటోలు వైరల్