‘మాస్ జాతర’ చిత్రంతో ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు హీరో రవితేజ. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ అధికారిగా కనిపించనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మ్యూజికల్ ప్రమోషన్స్ జోరు పెంచారు. బుధవారం సినిమాలో ‘హుడియో హుడియో..’ అంటూ సాగే మూడో గీతాన్ని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ గీతాన్ని దేవ్ రచించారు.
హేషమ్ అబ్దుల్ వహాబ్తో కలిసి భీమ్స్ ఆలపించారు. ‘నా గుండెగాలిపటమల్లే ఎగరేశావే, నీ చూట్టూ పక్కల తిరిగేలా గిరిగిశావే, నా కంటిరెమ్మల్లో కలలకు ఎర వేశావే..’ అంటూ హృద్యమైన ప్రేమ భావాలతో ఈ పాట సాగింది. ఈ పాటలో నాయకానాయికలు రవితేజ-శ్రీలీల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మాటలు: నందు సవిరిగాన, కెమెరా: విధు అయ్యన్న, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.