ప్రముఖ లిరిసిస్ట్ మాయా గోవింద్ (82) (Maya Govind) కన్నుమూశారు. గత నాలుగు నెలలుగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న మాయా గోవింద్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే యూరిన్ ఇన్ ఫెక్షన్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ముంబైలోని నివాసంలో గుండెపోటు (heart attack) రావడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్టు ఆమె కుమారుడు అజయ్ మీడియాకు వెల్లడించారు.
మెదడులో గడ్డ వల్ల అమ్మ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించింది. అయితే ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో నెలన్నర క్రితం ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చాం. ఆమె ఆరోగ్యంపై మంచి శ్రద్ద తీసుకున్నాం. ఉదయం గుండెపోటు రావడంతో కన్నుమూశారని అజయ్ తెలిపారు. మాయా గోవింద్ దివంగత రైటర్ -కమ్ డైరెక్టర్ రామ్ గోవింద్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమె ‘ఆంఖో మే బేస్ హో తుమ్’, ‘మై ఖిలాడీ తూ అనారీ’ (Main Khiladi Tu Anari), మోర్ ఘటర్ ఆయే సజన్వా, గుటుర్ గుటుర్ లాంటి పాపులర్ పాటలను రాశారు.
‘మా అమ్మ సుమారు 350 చిత్రాలకు పనిచేశారు. 800కు పైగా పాటలు రాశారు. ఆరోగ్య కారణాల రీత్యా అమ్మ యాక్టివ్‌గా ఉండేది కాదు. కానీ ఆమె బంధువులు, స్నేహితుల దగ్గరకు వచ్చినపుడు పద్యాలు చదివేందుకు ఎక్కువగా ఇష్టపడేది. ఆమె కల్యాణ్‌జీ-ఆనంద్జీ (Kalyanji-Anandji), రామానంద్ సాగర్, బప్పీ లహిరి ( Bappi Lahiri)కి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఖయ్యం సాబ్‌కు కూడా క్లోజ్‌గా ఉండేవారు. దురదృష్టవశాత్తు ఇపుడు ఆమె స్నేహితులు ఎవరూ లేరు. ఇపుడామె కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టారని’ ఆవేదనతో చెప్పుకొచ్చారు అజయ్.
మాయాగోవింద్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.