టాలీవుడ్ (Tollywood) న్యాచురల్ స్టార్ నాని లీడ్ రోల్ చేస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrityan) డైరెక్ట్ చేస్తున్నాడు. డిసెంబర్ 24న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి థియేటర్లు కరువయ్యాయన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
పదిమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న పెద్ద సినిమా థియేటర్ల కంటే కిరాణ కొట్టు వారికి వస్తున్న కలెక్షన్లు ఎక్కువగా ఉంటే బాధపడేది థియేటర్ల యాజమాన్యాలేనని, సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమాన పరచొద్దని నాని ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. దీంతో అధికారులు ఏపీలోని పలు ప్రాంతాల్లో థియేటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు థియేటర్లను సీజ్ చేశారు. అనంతపూర్‌లో నాని సినిమా ఆడబోయే థియేటర్ల లైసెన్స్ ను పరిశీలించి, థియేటర్ల ప్రాంగణంలో డిస్ప్లేపై టికెట్ల ధరలను చూపించాలని నోటీసులు అందజేశారు.
అనంతపూర్‌లోని గౌరీ థియేటర్లో తూనికలు, కొలతల అధికారులు థియేటర్లలో అమ్ముతున్న ఆహారపదార్థాలు, స్నాక్స్ ను పరిశీలించి వాటిని పరీక్షల నిమిత్తం లాబోరేటరీలకు పంపించారు. మరోవైపు కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్న సుమారు 12 థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా అదనపు షోలు వేసుకునేందుకు కూడా అనుమతివ్వలేదు. బెనిఫిట్ షో వేసుకోవాలంటే అనుమతి తప్పనిసరిగా చేశారు. మరి శ్యామ్ సింగ రాయ్ పరిస్థితి ఏపీలో ఎలా ఉండబోతుందనేది చూడాలి.