హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పారు. అఖండ, పుష్పచిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందన్నారు. తెలంగాణలో టికెట్ ధరలు పెంచడంతో పాటు ఐదో ఆటకు అనుమతించామన్నారు. ఏపీలో థియేటర్ల సమస్యపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానన్నారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా ఉండాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. సినిమాకు కులం, మతం, ప్రాంతాలుండవన్నారు. ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమే సినిమా అని తెలిపారు. సినీ పరిశ్రమపై సత్వరమే స్పందిస్తున్నట్లు చెప్పారు. సినీరంగంపై ఆధారపడి వేలాది మంది జీవనం కొనసాగిస్తున్నారన్న ఆయన.. పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. రాష్ట్రంలో సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.