Devara Review | ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా.. సోలో హీరోగా ఎన్టీఆర్ (Jr NTR) నుంచి ఆరేళ్ల తర్వాత వచ్చిన సినిమా.. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన నాలుగో సినిమా.. ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా.. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమైన సినిమా.. ఓవర్సీస్లో ప్రీసేల్‌లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన తొలి సినిమా.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, భారీ అంచనాలు మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దేవర’.. ఆ అంచనాలని అందుకుందా ? సినీ అభిమానులని అలరించిందా?
కథ :
రత్నగిరి.. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతం. అక్కడ సముద్రానికి ఆనుకుని ఉన్న ఓ కొండపై నాలుగు ఊళ్లని కలిపి ‘ఎర్ర సముద్రం’ అని పిలుస్తుంటారు. ‘ఎర్ర సముద్రం’కి బ్రిటీష్ కాలం నాటి చరిత్ర వుంటుంది. అక్కడి ప్రజలకు భయం అంటే ఏమిటో తెలీదు. బ్రిటిష్ వారు మన దేశ సంపదని దోచుకొని, ఇంగ్లండ్ తీసుకెళ్లిపోతుంటే ఎర్రసముద్రం ప్రజలు ఒక సైన్యంగా ఏర్పడి బ్రిటీష్ వాళ్లని అడ్డుకొని, ఆ సంపద తిరిగి దేశానికి పంచుతుంటారు.
అయితే అలాంటి ఎర్రసముద్రం ప్రజలు స్వాతంత్య్రం వచ్చాక నిర్లక్ష్యానికి గురౌతారు. వారిని ఎవరూ పట్టించుకోరు. దీంతో సముద్రంలో సరుకు రవాణ చేస్తున్న ఓడల్లో దొంగతనం చేసి, అందులోని విలువైన వస్తువుల్ని షావుకార్లకు అప్పగించే సముద్రపు దొంగలుగా మారిపోతారు. షావుకారు ఇచ్చిన డబ్బుతో బ్రతకడం అలవాటు చేసుకుంటారు. ‘ఎర్ర సముద్రం’లో ఓ ఊరికి నాయకుడు దేవర (ఎన్టీఆర్). తనకి ఈ సముద్రపు దొంగతనాలు ఇష్టం వుండదు. ఒకానొక సందర్భంలో తాము చేస్తున్న ఈ దొంగతనాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకొంటాడు దేవర.
ఇకపై దొంగతనాలు చేయడానిని వీలు లేదని నిర్ణయిస్తాడు. ఎర్రసముద్రంలో మరో ఊరుకి నాయకుడు భైర (సైఫ్ అలీఖాన్). దేవర అడ్డుతొలగించి సముద్రాన్ని రూల్ చేయాలని చూస్తుంటాడు భైర. మరి భైర, దేవర అడ్డుతొలగించాడా? ఈ కథలో వర(దేవర కొడుకు) తంగం (జాన్వి కపూర్) పాత్రలు ఏమిటి? ఎర్రసముద్రంలో భయం పుట్టించడానికి దేవర ఏం చేశాడు ? అనేది మిగత కథ.
కథా విశ్లేషణ:
దర్శకుడు కొరటాల శివ సినిమాలు ఒక బలమైన పాయింట్ చుట్టూ తిరిగుతాయి. ఆయన కథా ఉద్దేశంలోనే హీరోయిజం వుంటుంది. దేవరలో కూడా అలాంటి ఓ మంచి ఉద్దేశం వుంది. ‘మనిషికి బతికేంత ధైర్యం చాలు.. చంపేంత ధైర్యం అవసరం లేదు. మితిమీరిన ధైర్యం కూడా అనర్ధమే’ ఈ మాట చుట్టూ అల్లుకున్న కథ దేవర. దీనికి సముద్రం బ్యాక్ డ్రాప్ ని ఎంచుకొని ఓ సముద్ర కాపరి కథగా మలచడంలో సక్సెస్ అయ్యారు కొరటాల. సముద్రపు దొంగల కథలు చాలా వచ్చాయి. కానీ కొరటాల దేవరని సముద్ర కాపరి కథగా చెప్పే ప్రయత్నం సరికొత్త అనుభూతిని పంచుతోంది.
యతి క్యారెక్టర్ ని వెదుక్కొంటూ పోలీస్ ఆఫీసర్ల ఎర్రసముద్రానికి వచ్చే ఆసక్తికరమైన సన్నివేశాలతో దేవర కథ మొదలౌతుంది. ఎన్టీఆర్ పాత్ర పరిచయం అభిమానులకు పండగలా వుంటుంది. ఈ సినిమా కోసం ఎర్రసముద్రం అనే ప్రాంతన్ని సృష్టించారు కొరటాల. ఆ వరల్డ్ బిల్డింగ్ చాలా సహజంగా ప్రేక్షకుడిని కథలో లీనం చేసేలా వుంటుంది. ఆయుధ పూజ పాట, తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్స్ అలరిస్తాయి. దేవర క్యారెక్టర్ లో వచ్చే మార్పుకి సంబధించిన సీన్ ని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు కొరటాల. తను ఎందుకు ధైర్యానికి భయం పుట్టించాలని నిర్ణయించుకోవాల్సివస్తుందో చెప్పే సన్నివేశంలో ఎమోషన్ ఆడియన్ కి బలంగా పడుతుంది. ‘నాకు ధైర్యం చాలక నీ కాళ్ళని చూసి మాట్లాడుతున్నాను తల్లి’అనే డైలాగ్ వచ్చిన చోట దేవర ఎమోషన్ పీక్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది.
దేవర ధైర్యవంతుడైతే తన కొడుకు వర భయస్తుడు. ఫస్ట్ హాఫ్ లో వున్న మూడ్ కి భిన్నంగా వర కథతో సెకండ్ హాఫ్ మొదలౌతుంది. తంగం క్యారెక్టర్ తో అతని ప్రేమకథ పెద్ద ప్రభావాన్ని చూపలేదు. చుట్టమల్లె సాంగ్ కాస్త గ్లామర్ ని యాడ్ చేసింది. తొలి సగంతో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త నింపాదిగా అనిపిస్తుంది. అటు భైర క్యారెక్టర్ లో కూడా ఎలాంటి కదలిక వుండదు.
అయితే చివరి ఇరవై నిమిషాల్లో మళ్ళీ దేవర తాండవం వుంటుంది. మాస్ కమర్షియల్ ఎలివేషన్ మూమెంట్స్ అభిమానులని అలరిస్తాయి. సొర చేపని వాహనంగా వాడుకొని ఎన్టీఆర్ చేసిన పోరాటం ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా వుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, ప్రకాష్ రాజ్ ఇచ్చే ఎలివేషన్స్ భలే కుదిరాయి. పార్ట్ 2 పై ఆసక్తి పెంచేలా కథని ముగించిన విధానం బావుంది.
నటీనటులు నటన:
దేవర పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు ఎన్టీఆర్. చాలా సెటిల్డ్ గా చేశారు. సినిమా అంతా తన భుజాన మోశారు. వర కాస్త చెలాకీగా అమాయకంగా వుండే క్యారెక్టర్. రెండిట్లోనూ మంచి వేరియేషన్స్ చూపించారు. ఆయుధ పూజ, పెళ్లి పాటలో డ్యాన్సులు అలరిస్తాయి. యాక్షన్ లో అయితే ఎన్టీఆర్ శివతాండవం చూడొచ్చు. జాన్వి క్యారెక్టర్ కు అంత ప్రాధాన్యత లేదు. ఏదో పాటకు అన్నట్టుగా వుంది. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ గా కనిపించారు. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత చురుకుదనం సెకెండ్ హాఫ్ లో కనిపించలేదు. శ్రీకాంత్ తన అనుభవాన్ని చూపించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎలివేషన్స్ కి ఉపయోగపడింది. మురళి శర్మతో పాటు మిగతా పాత్రలు కథ మేరకు బాగానే కుదిరాయి.
టెక్నికల్ : అనిరుద్ మ్యూజిక్ అదరగొట్టాడు. పాటలన్నీ రిజిస్టర్ అయ్యాయి. నేపధ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో చేశాడు. యాక్షన్ సీన్స్ కి పవర్ ప్యాక్డ్ మ్యూజిక్ ఇచ్చాడు. చుట్టమల్లె సాంగ్ ని వర ఫైట్ బీజీఎంగా వాడటం అనిరుద్ మార్క్ ని చాటింది. రత్నవేల్ కెమెరాపనితనం బావుంది.
శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ లో తన మార్క్ చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా వున్నాయి. ఎమోషనల్ డెప్త్ వుండే మాటలు రాశారు కొరటాల. బలమైన కథతో పాటు అభిమానులు నచ్చేలా ఎన్టీఆర్ ని ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి దేవరతో దసరా ముందుగానే వచ్చేసింది.
ప్లస్ పాయింట్స్ :
ఎన్టీఆర్, కథా నేపథ్యం,
ఫస్ట్ హాఫ్, యాక్షన్, మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ మెరుపులు తగ్గడం
వర, తంగం వీక్ ట్రాక్
ఫైనల్ టచ్: దేవర.. ఎన్టీఆర్ శివ తాండవం
రేటింగ్ :
3/5
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్
Jani Master | రెండో రోజు విచారణ.. షూటింగ్ స్పాట్స్‌కు జానీ మాస్టర్.. !