Ram Gopal Varma | టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) రేపు గుంటూరులో సీఐడీ విచారణకు హాజరు కాలేనని సీఐడీకి సమాచారమందించాడు. సారీ మూవీ ప్రమోషన్స్‌లో ఉండటం వల్ల కారణంగా విచారణకు హాజరుకాలేనని తెలిపాడు వర్మ. ఈ నెల 28న సారీ విడుదల ఉండటంతో బిజీగా ఉన్న కారణంగా విచారణకు రాలేనని.. 8 వారాల సమయం ఇవ్వాలని కోరాడు.
8 వారాల తర్వాత డేట్ ఇస్తే విచారణకు హాజరవుతానని సీఐడీ ఇన్స్పెక్టర్ తిరుమల రావు, సీఐడీ చీఫ్ రవి శంకర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారమందించినట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఘటనలో వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు సినిమా పోస్టర్లపై అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో వర్మ మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
వర్మపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇటీవలే ఆర్జీవీకి ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 7న విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి ఆర్జీవీ స్పందిస్తూ విచారణకు హాజరవుతానని కూడా చెప్పాడు.