బాలీవుడ్ (Bollywood)లో బయోపిక్ ల పరంపర ఇప్పట్లో ఆగేలా లేదు. వరుసబెట్టి జీవిత కథా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఎక్కడ సెలబ్రిటీ ఉన్నా, ఏ రంగంలో పేరు తెచ్చుకున్నా, అతని జీవితాన్ని సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో వంటలరాణిగా పేరున్న దిగ్గజ చెఫ్ తార్లా దలాల్ (Tarla Dalal) బయోపిక్ నిర్మితమవుతున్నది. ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో హ్యూమా ఖురేషి (Huma Qureshi) నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని ఆర్ఎస్ వీపీ బ్యానర్ లో రోనీ స్క్రూవాలా, ఐశ్వినీ ఐయ్యర్ తివారీ, నితీష్ తివారీ నిర్మిస్తున్నారు. పీయూష్ గుప్తా (Piyush Gupta) దర్శకత్వం వహిస్తున్నారు. తార్లా టైటిల్ తో తెరకెక్కుతున్నదీ సినిమా. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో చుట్టూ మసాలా దినుసుల డబ్బాలతో రొట్టె కోలతో నవ్వుతూ నిలబడి ఉంది హ్యూమా. తార్లా దలాల్ లా కనిపించేందుకు ఎత్తువరుస పళ్లను సెట్ చేశారు.
ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా హ్యూమా ఖురేషి మాట్లాడుతూ…నా బాల్యంలో మా అమ్మ తార్లా దలాల్ వంట పుస్తకాలు చదివి మాకు అల్పాహారం చేసి పెట్టేది. పుస్తకంలోని హోం మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీ నాకింకా గుర్తే. ఈ పాత్రలో నటించడం నా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్లినట్లుంది..అని చెప్పింది. భారతీయ వంటల గురించి వందకు పైగా పుస్తకాలు రాసింది వంటలక్క తార్లా దలాల్. ఆమె రాసిన పుస్తకాలు కోటి ప్రతులు అమ్ముడయ్యాయి. ఇంటర్నెట్ ఊసే లేని 80, 90 దశకాల్లో తార్లా వంటల పుస్తకాలు చాలా ప్రసిద్ధి పొందాయి.