‘తెలివైన వాడు తెలివితక్కువ పనిచేస్తే, తెలివిలేని వాళ్లు తెలివైన పనిచేస్తే వాళ్ల జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలేమిటన్నదే మా చిత్ర కథాంశం’ అని హీరో నరేష్ ఆగస్త్య అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. డార్క్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి మురళీమనోహర్ దర్శకుడు. ఈ సందర్భంగా బుధవారం హీరో నరేష్ ఆగస్త్య విలేకరులతో సినిమా సంగతులను పంచుకున్నారు.
ఓ మిత్రబృందం అడవిలో శవాన్ని వెలికి తీయడానికి చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని, ఇంతకి ఆ శవం ఎవరిది? దానివెనకున్న రహస్యమేమిటన్నది ఆద్యంతం థ్రిల్‌ని పంచుతుందని తెలిపారు. ‘ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా సాగుతుంది. బ్రహ్మానందం, యోగిబాబు పాత్రలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఆద్యంతం వినోదప్రధానంగా నడిచే కథే అయినా అంతర్లీనంగా బలమైన ఉద్వేగాలుంటాయి. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యాయి. సినిమా చూసినవాళ్లందరూ బాగుందని ప్రశంసిసున్నారు. విజయంపై మా టీమ్ అంతా పూర్తి నమ్మకంతో ఉన్నాం’ అన్నారు.