Govinda | ప్రమాదవశాత్తు తుపాకీ పేలిన ఘటనలో బాలీవుడ్ నటుడు గోవిందా తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం ముంబయిలోని ఆయన స్వగృహంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లైసెన్స్డ్ రివాల్వర్‌ను కప్‌బోర్డ్‌లో పెడుతుండగా ట్రిగ్గర్ ప్రెస్ కావడంతో బుల్లెట్ మెకాలిలోకి దూసుకెళ్లింది. వెంటనే ఆయన్ని కుటుంబ సభ్యులు దగ్గరలోని క్రిటీ కేర్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు శస్త్ర చికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. కోల్‌కతాలో జరిగే ఓ షోలో పాల్గొనేందుకు గోవిందా మంగళవారం నాలుగు గంటల సమయంలో ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరేముందు, తన లైసెన్స్డ్ రివాల్వర్‌ను పరీక్షిస్తుండగా ఈ ఘటన జరిగిందని గోవిందా మేనేజర్ మీడియాకు తెలిపారు.
‘తన్బదన్’ (1986)చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన గోవిందా అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి కమర్షియల్ హీరోగా గుర్తింపు పొందారు. గత ఐదేళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటున్నారు గోవిందా. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన శివసేన పార్టీలో చేరారు.