గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 20, 2020 , 00:55:06

‘రంగీలా’లో నాగార్జున, రజనీకాంత్‌

‘రంగీలా’లో నాగార్జున, రజనీకాంత్‌

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన కల్ట్‌క్లాసిక్‌ ‘రంగీలా’ చిత్రం ఇటీవలే ఇరవైఐదు వసంతాలు పూర్తిచేసుకుంది. అమీర్‌ఖాన్‌, ఊర్మిళ, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం నాటి యువతరాన్ని ఉర్రూతలూగించింది. వినూత్న ఇతివృత్తంతో పాటు సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్‌ డిజైన్‌ పరంగా తొంభయ్యవ దశకంలో ఈ సినిమా కొత్త ట్రెండ్‌కు నాందిపలికింది. మనీష్‌మల్హోత్రా ైస్టెలింగ్‌ ప్రాచుర్యం పొందింది. ఈ సినిమా ద్వారానే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో కాస్ట్యూమ్‌ డిజైన్‌ విభాగాన్ని చేర్చారు. తొలి పురస్కారాన్ని మనీష్‌మల్హోతా అందుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ జాతీయ పత్రికతో ముచ్చటించిన ఊర్మిళ పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. ‘తొలుత ఈ సినిమాలో ప్రధాన పాత్రల కోసం నాగార్జున, శ్రీదేవి, రజనీకాంత్‌లను అనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల రజనీకాంత్‌, నాగార్జున ఈ సినిమాలో భాగం కాలేకపోయారు. ఆ తర్వాత అమీర్‌ఖాన్‌, జాకీష్రాఫ్‌లను ఎంపిక చేశారు. నాగార్జున, రజనీకాంత్‌ నటించినా ఈ సినిమా అదే స్థాయిలో గుర్తింపును సంపాదించుకునేది’ అని ఊర్మిళ చెప్పింది.