తన మధురగానంతో దశాబ్దాల పాటు సంగీతప్రియులను అలరించారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అజరామరమైన గీతాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2020 సెప్టెంబర్ 25న ఆయన స్వర్గస్తులయ్యారు. బుధవారం ఆయన నాలుగో వర్ధంతిని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. చెన్నై నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ పేరు పెడుతున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు. సీఎం స్టాలిన్ నిర్ణయంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.