Emergency | కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యేలా కనిపిస్తోంది. ‘ఎమర్జెన్సీ’ చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డ్ బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 6న విడుదలకావాల్సి ఉంది. 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కంగనా రనౌత్.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఆమె దర్శకురాలు కూడా. అయితే ఈ సినిమాలో సిక్కుల మనోభావాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ విడుదలకు అనుమతిని నిరాకరించింది. దీంతో కంగన టీమ్ బాంబే హైకోర్టు ( Bombay High Court)ను ఆశ్రయించింది.
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో సెప్టెంబర్ 25లోగా ఒక నిర్ణయానికి రావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సినిమాలో కొంత సున్నితమైన కంటెంట్ ఉందని.. వాటిని తొలగిస్తే సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు కోర్టుకు తెలియజేసింది. దీంతో నిర్మాణ సంస్థ సెన్సార్ బోర్డు సూచనలపై నిర్ణయం తీసుకోవడానికి సమయం కోరింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. ఈలోగా నిర్ణయం తీసుకోవాలని నిర్మాణ సంస్థను కోర్టు ఆదేశించింది. ఈ పరిణామాలతో ‘ఎమర్జెన్సీ’ విడుదలకు త్వరలో చిక్కులు తొలుగుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1972లో విధించిన ఎమర్జెన్సీ కాలంనాటి రాజకీయ పరిణామాల గురించి ఈ సినిమాలో వివరించారు. అయితే, సిక్కుల మతస్థుల మనోభావాలు దెబ్బతీలా ఈ సినిమా తీశారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆరోపిస్తోంది. అకాల్ తఖ్త్ సాహిబ్‌పై బాంబు దాడి, ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జెన్సీ టైంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను విస్మరిస్తూ.. కథను పూర్తిగా ఒకవైపు మాత్రమే చూపించారని కొన్ని వర్గాలు ఎమర్జెన్సీ సినిమాని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని CBFC తెలిపింది. ఈ కారణాలతో ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇప్పటి వరకూ సర్టిఫికెట్ ఇవ్వలేదు.
ఈ క్రమంలోనే కంగన, చిత్ర నిర్మాణ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్స్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని మందలించింది. సృజనాత్మకత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొంది. శాంతిభద్రతలకు ముప్పు ఉందనే కారణంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నిరాకరించడంపై ఘాటు స్పందించింది. ఎమర్జెన్సీకి సర్టిఫికెట్ జారీ చేయడంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై జస్టిస్ బీపీ కొలబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 25లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
‘ఎమర్జెన్సీ’ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read..
PM Modi | ప్రధాని సమక్షంలో చెస్ ఆడిన ప్రజ్ఞానంద్, అర్జున్.. వీడియో వైరల్
Sanjay Raut | పరువు నష్టం కేసు.. ఎంపీ సంజయ్ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష