న్యూఢిల్లీ: కోవిడ్ లాక్డౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లల్లో దృష్టిలోపం(Children Short-Sight) సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు గుర్తించారు. చిన్నారుల్లో హ్రస్వి దృష్టి, దగ్గర చూపు సమస్యలు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు ఓ స్టడీలో తేల్చారు. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్థమాలజీ దీనిపై రిపోర్టును పబ్లిష్ చేసింది. సుమారు ఆరు ఖండాలకు చెందిన 50 దేశాల్లోని 50 లక్షల మంది చిన్నారులను అధ్యయనం చేసిన తర్వాత ఈ రిపోర్టును రిలీజ్ చేశారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మయోపియా కంటి సమస్యలు లక్షలాది మంది చిన్నారుల్లో నమోదు కానున్నట్లు రిపోర్టులో తెలిపారు. కరోనా వల్ల లాక్డౌన్ విధించిన సమయంలో.. ఇంట్లోనే ఉన్న పిల్లలు ఎక్కువ శాతం స్క్రీన్ టైంను పెంచేశారని, దీనికి తోడు ఆరుబయట ఆడే సమయాన్ని తగ్గించారని, దీని వల్ల కంటి సమస్యలు అధికమైనట్లు రిపోర్టులో వెల్లడించారు.
దగ్గర కంటి చూపు సమస్యలు ఆసియాలో అధికంగా ఉన్నట్లు తేలింది. ఆసియాలోని జపాన్ చిన్నారుల్లో ఆ సమస్య 85 శాతం ఉందని, దక్షిణ కొరియాలో 73 శాతం ఉన్నట్లు గుర్తించారు. ఇక చైనా, రష్యా దేశాల్లో ఆ సమస్య 40 శాతం పిల్లల్లో ఉన్నట్లు తేల్చారు. పరాగ్వే, ఉగాండా దేశాల్లో అత్యల్ప స్థాయిలో ఈ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఆ దేశాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే సమస్య ఉన్నది. బ్రిటన్, ఐర్లాండ్, అమెరికా దేశాల్లో ఆ సమస్య 15 శాతంగా ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా మయోపియా దృష్టి సమస్యలు.. 1990 నుంచి 2023 వరకు మూడు రెట్లు అధికమైనట్లు స్టడీలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 36 శాతం పిల్లల్లో ఈ సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. కరోనా మహమ్మారి తర్వాత ఇది మరింత పెరిగినట్లు అంచనా వేశారు. ప్రైమరీ స్కూల్ దశలో మయోపియా సమస్యలు మొదలవుతాయని, 20 ఏళ్ల వరకు కంటి సమస్యలు వస్తాయి. 2050 నాటికి ప్రపంచంలోని టీనేజర్లలో సగం మందికి మయోపియా వ్యాధి బారినపడుతారని రిపోర్టులో తెలిపారు. మయోపియా సమస్య నుంచి బయటపడాలంటే, ప్రతి రోజు పిల్లలు కనీసం రెండు గంటల పాటు బయట గడపాలని, ఏడు నుంచి 9 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఇది చాలా ముఖ్యమని నిపుణులు సూచించారు.