Cinema Lovers Day | సినిమా లవర్స్‌కు గుడ్‌న్యూస్. కేవలం రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశం రాబోతుంది. ఈ నెల 31న సినిమా లవర్స్ డే (Cinema Lovers Day) సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Multiplex Association of India) ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న PVR, Inox, Cinepolis, Mirage, CityPride, Asian, MovieTine వంటి మల్టీప్లెక్స్ థియేటర్ల (Multiplex Theaters)లో కేవలం రూ.99కే సినిమా చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పిస్తోంది.
31వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా ప్రేక్షకులు రూ. 99కే చూడొచ్చు. చాలా మంది ప్రేక్షకులకు మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలని ఆశగా ఉంటుంది. కానీ టిక్కెట్ రేట్ల కారణంగా వెనకడుగు వేస్తుంటారు. ఇక ఇప్పుడు వాళ్ళందరూ సింగిల్ స్క్రీన్ థియేటర్ల టిక్కెట్ రేట్ల కంటే తక్కువ ధరతోనే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశం లభించినట్లైంది.
కాగా, ఈ వేసవి సెలవుల్లో సినీ లవర్స్‌కు నిరాశే మిగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఓ వైపు ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా.. అదే సమయంలో ఐపీఎల్ సీజన్ కారణంగా ఈ సమ్మర్లో పెద్ద హీరోల సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. విడుదలైన చిన్న చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టులోకపోయాయి. దీంతో థియేటర్ నిర్వాహకులకు తీవ్ర దెబ్బపడింది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులను మళ్లీ థియేటర్లవైపు రప్పించే చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే మల్టీప్లెక్స్ అసోసియేషన్ టిక్కెట్లపై డిస్కౌంట్ ప్రకటించింది. రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది.
ఇక పేటీఎం, అమెజాన్ పే, బుక్‌మైషో వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈనెల 31 సినిమా టిక్కెట్లు బుక్ చేసుకునే వారు రూ.99తోపాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే థియేటర్ కౌంటర్ వద్ద టిక్కెట్ కొనుగోలు చేస్తే మాత్రం ఎలాంటి ఇతర చార్జీలూ వర్తించవు. కేవలం రూ.99కే టిక్కెట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ బంపర్ ఆఫర్‌ను ఉపయోగించుకుని రూ.99కే కొత్త సినిమాను ఎంజాయ్ చేయండి. విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రాలు ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Also Read..
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు భారీ షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ
Prajwal Revanna | రేపు భారత్‌కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ.. ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేసే అవకాశం..!
Virat Kohli | అనుష్కతో కలిసి డిన్నర్ డేట్‌ను ఎంజాయ్ చేసిన విరాట్ కోహ్లీ.. పిక్స్ వైరల్