Pooja Hegde | దక్షిణాది సినీ పరిశ్రమలో కెరీర్ మొదలుపెట్టిన చాలా మంది హీరోయిన్లు అటు నుంచి బాలీవుడ్‌కు మకాం మార్చేస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే అప్పటిదాకా సౌత్‌లో గ్లామరస్ రోల్స్‌లో సక్సెస్ఫుల్ కెరీర్ సాగించిన కొందరు భామలు మాత్రం ఇక్కడ ఆఫర్లు తగ్గి బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తమను దక్షిణాది సినీ పరిశ్రమ తమలోని టాలెంట్‌ను ఎప్పుడూ గుర్తించలేదంటూ వాపోతుంటారు. అయితే ఈ విషయంలో పూజాహెగ్డే మాత్రం భిన్నంగా తన స్వరాన్ని వినిపిస్తుంది.
ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది ముంబై ముద్దుగుమ్మ పూజాహెగ్డే. తక్కువ టైంలోనే తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఎఫ్ 3 తర్వాత తెలుగులో మరే సినిమా చేయని పూజా హెగ్డే కొంతకాలంగా తమిళంలో బిజీగా ఉన్నా, హిందీలో కొనసాగుతున్నప్పటికీ ఈ భామకు అవకాశాలు తగ్గిపోయాయి.
అయితే ఈ దక్షిణాది సినిమాలపై పూజాహెగ్డే చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ తనకు ఎప్పుడూ బలమైన పాత్రలు ఇవ్వలేదని.. తనను కేవలం గ్లామరస్ హీరోయిన్గా మాత్రమే చూసిందని చెప్పింది. బాలీవుడ్లో తనకు వచ్చిన పాత్రలు అంతగా గుర్తు పెట్టుకునేంతవేమి కావంది. అయితే సౌత్ సినిమా మాత్రం తనకు అద్భుతమైన స్క్రిప్ట్‌తోపాటు చాలెంజింగ్ పాత్రలను ఇచ్చిందంటూ.. దక్షిణాది సినీ పరిశ్రమను ఆకాశానికెత్తేసింది.
అయితే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో సినిమాను హైలెట్ చేసింది పూజాహెగ్డే. రెట్రో సినిమాలో తాను తనలోని నటనానైపుణ్యాలను వెలికితీసే అద్భుతమైన పాత్రలో నటించానని.. భవిష్యత్‌లో అలాంటి పాత్రలు వస్తే చేయాలనుందంటూ మనసులో మాట చెప్పుకొచ్చింది. ఇంకేంటి మరి రాబోయే రోజుల్లో పూజాహెగ్డే కోరుకుంటున్నట్టుగా దర్శకనిర్మాతలెవరైనా అలాంటి పాత్రలతో సంప్రదిస్తారో చూడాలి మరి. రజినీకాంత్ నటించిన కూలీలో మోనికా సాంగ్‌లో మెరువనుంది పూజాహెగ్డే.