Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా హరర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5, 2025న ఈ చిత్రం విడుదల కానుందని అఫీషియల్‌గా ప్రకటించారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుండగా, ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. నిర్మాతల మధ్య జరిగిన నిధుల వివాదంతో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. రాజాసాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తున్న ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 2023లో ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. రూ.218 కోట్ల పెట్టుబడి పెట్టిన ఈ సంస్థ, లాభాల్లో వాటా, క్రెడిట్ లైన్ పైన అంగీకారం పొందింది.
అయితే ఐవీవై ఎంటర్టైన్మెంట్ ఆరోపించిన ప్రకారం.. సినిమాను ఆలస్యం చేస్తూ వస్తున్నారని,ప్రొడక్షన్ అప్డేట్స్ చెప్పడం లేదని, నిధుల వినియోగం పై పూర్తి వివరాలు అందించలేదని పేర్కొంది.అంతేకాకుండా, అనేకసార్లు రిలీజ్ వాయిదా వేయడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థ 218 కోట్ల పెట్టుబడిపై 18 శాతం వడ్డీతో సహా తమకు రికవరీ ఇవ్వాలంటూ, సినిమా విడుదలను ఆపేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఐవీఎ ఎంటర్టైన్మెంట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం.. టీజీ విశ్వ ప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), వివేక్ కుచిబోట్ల, డెక్కన్ డ్రీమ్స్ యానిమేషన్స్, ప్రసాద్ ఎక్స్ట్రీమ్ డిజిటల్, క్యూబ్ సినిమా టెక్నాలజీస్, యూఎఫ్‌వో మూవీస్ వారు ఏ పనైనా తమ అనుమతి లేకుండా చేయకూడదని సూచించింది.
దీనిపై స్పందించిన పీపుల్స్ మీడియా సంస్థ రాజా సాబ్ చిత్రం నాన్ థియేట్రికల్ డీల్ ఇంకా క్లోజ్ కాలేదు. ఆ కారణం వల్లనే సినిమా వాయిదా పడింది. అయితే కావాలని తమ పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ ఐవీవైపై కోర్టుని ఆశ్రయించింది. మొత్తానికి ఈ వివాదంతో రాజాసాబ్ చిత్రం ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తుండగా,కథానాయికలుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు.సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండగా,సంగీతాన్ని తమన్ అందిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది.