Anjali Patil | సైబర్ మోసాలపై (Cyber Fraud) పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. ఎంత అవగాహన కల్పిస్తున్నా ఎవరో ఒకరు ఇంకా ఈ మోసాలకు బలవుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం కేటుగాళ్ల చేతిలో దారుణంగా మోసపోతున్నారు. తాజాగా ఓ నటి సైబర్ ఉచ్చులో చిక్కుకుని ఏకంగా రూ.లక్షలు పోగొట్టుకుంది.
తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ నటి అంజలి పాటిల్ (Anjali Patil). తెలుగులో ‘నా బంగారు తల్లి’ సినిమాలో లీడ్ రోల్ పోషించి పేరు సంపాదించుకుంది. తాజాగా ఈ నటి సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి లక్షల రూపాయలు పోగొట్టుకుంది. కొన్ని రోజుల క్రితం దీపక్ శర్మ అనే వ్యక్తి.. అంజలికి ఫోన్ చేసి తాను ఫెడెక్స్ కొరియర్ సంస్థ (FedEx Courier Company) ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. తైవాన్‌కు వెళ్తున్న ఓ పార్శిల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయని (Drugs In Package).. అందులో మీ ఆధార్ వివరాలు ఉన్నాయంటూ అంజలిని భయపెట్టాడు. ఆ పార్శిల్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేసినట్లు చెప్పాడు. వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు వెంటనే ముంబై సైబర్ క్రైం పోలీసులను సంప్రదించాలని చెప్పి సదరు వ్యక్తి కాల్ కట్ చేశాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికి బెనర్జీ అనే వ్యక్తి అంజలికి ఫోన్ చేశాడు. తాను ముంబై సైబర్ పోలీసునని పరిచయం చేసుకున్నాడు. అంజలి ఆధార్ కార్డు మూడు బ్యాంకు ఖాతాలకు కనెక్ట్ అయ్యిందని, ఆ ఖాతాలు మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నాయని చెప్పాడు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ.96,525 చెల్లించాలని డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఇన్వెస్టిగేషన్ కోసం మరో రూ.4,83,291 వరకు ఖర్చవుతుందని చెప్పడంతో భయపడిపోయిన అంజలి మొత్తం డబ్బును వారు పంపిన పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఇలా కేటుగాళ్లు మొత్తంగా అంజలి నుంచి రూ.5.79 లక్షలు కాజేశారు.
ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన నటి.. డీఎన్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా చెప్పింది. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు ఇలాంటి నేరాలపై ఫెడెక్స్ స్పందించింది. తమ సంస్థ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని అడగదని స్పష్టం చేసింది. కొరియర్ పార్శిల్స్‌లో మీ వివరాలు ఉన్నాయంటూ ఎవరికైనా అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజెస్ వస్తే అలాంటి వాటికి స్పందించొద్దని హెచ్చరించింది. అలాంటి కాల్స్‌పై సమీపంలోని సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని సూచించింది.
Also Read..
Chaddannam | అమెరికాలో చద్దన్నానికి యమా క్రేజ్.. ధర తెలిస్తే షాకే..!
JN.1 | డేంజర్ బెల్స్.. 511కి పెరిగిన కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు..!
MS Dhoni | దుబాయ్‌లో ధోనీ న్యూఇయర్ సెలబ్రేషన్స్.. వీడియో షేర్ చేసిన సాక్షి సింగ్