హైదరాబాద్ ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై అక్రమ కే సులు, కుట్రలు, నోటీసులు, లీకులతోనే రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలన ముగిసిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఎద్దేవా చేశారు. సాధించిన అభివృద్ధి సున్నా అని, చేసింది చెప్పుకోలేక.. సాధించిన ప్రగతి చూపలేక సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ మురుగు కాలువలు, రోడ్ల అభివృద్ధిని విస్మరించి డైవర్షన్ పాలిటిక్స్ ఎజెండాగానే ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. రెం డేండ్ల ప్రగతిపై మాట్లాడే ధైర్యంలేకనే కేసీఆర్‌పై దూషణపర్వం సాగించారని విమర్శించారు. తెలంగాణ భవన్లో సోమవారం వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ డ్రామాలను ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. లీడర్ సమ్మిట్ పేరిట హార్వర్డ్‌కు వెళ్లిన ఆయన నేర్చుకున్నది నాయకత్వ లక్షణాలు కాదని, పచ్చి బూతులని చురకలంటించారు. హార్వర్డ్ వెళ్లినా ముఖ్యమంత్రి అల్ప బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు.
రెండేండ్లలో కనీసం ఒక్క ఇటుకపెళ్ల కూడా పేర్చని రేవంత్ ప్రభుత్వం హైడ్రా కూల్చివేతల పేరిట ప్రజల జీవనాధారంపై దాడి చేస్తున్నదని సంజయ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రజాపాలన ముసుగులో దుర్మార్గపు పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు. అభివృద్ధిని విస్మరించి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అహంకారాన్ని ప్రదర్శిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హామీలపై దృష్టి మళ్లించేందుకు, పాలనా వైఫల్యాలను దాచిపెట్టేందుకు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో రేవంత్ సర్కార్ సాగిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌కు బీజేపీ పరోక్ష మద్దతు ఇస్తున్నదని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిమంది చొప్పున ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రజాసమస్యలను విస్మరిస్తున్నదని విమర్శించారు. అధికారపక్షాన్ని నిలదీయాల్సిన ఆ పార్టీ ముఖ్యనేతలు కేసీఆర్, కే టీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం వారి చీకటి బంధానికి నిదర్శనమని స్పష్టంచేశారు. రేవంత్‌కు మద్దతు పలుకుతూ పబ్బం గడపడం తప్ప తెలంగాణకు చేసింది శూన్యమని ఆరోపించారు.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రెండేండ్లలో రే వంత్‌రెడ్డి చేసిన అభివృద్ధిపై బీఆర్ఎస్ చర్చకు సిద్ధంగా ఉన్నదని సంజయ్ ప్రకటించారు. దమ్ముంటే అధికారపక్షం సైతం ముందుకు రావాలని సవాల్ విసిరారు. తమ మైక్‌లు కట్ చేసి గొంతునొక్కవద్దని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 హామీల ను పక్కనబెట్టి.. కేసులు, నోటీసులు, డైవర్షన్ గేమ్‌లతో కాలంగడిపితే రాష్ట్రంలోని యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజలపై చిత్తశుద్ధి, అభివృద్ధిపై నిబద్ధత ఉంటే హామీల అమలుపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.