శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 14:00:46

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం న‌ట ప్ర‌స్థానం

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం న‌ట ప్ర‌స్థానం

తెలుగు సినీ, సంగీత రంగాల్లో తనదైన ముద్ర వేసిన మహోన్నతులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.  విల‌క్ష‌ణ‌మైన గాత్రంతో ఐదు ద‌శాబ్ధాలుగా అల‌రిస్తూ వ‌స్తున్న బాలు త‌న‌లోని ధ్వన్యనుకరణ క‌ళాత్మ‌క‌త‌తోను ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. తెలుగులో 50 సినిమాలు, త‌మిళంలో 14, హిందీలో 5, క‌న్న‌డంలో 9 సినిమాలలో న‌టించారు. 1972లో వ‌చ్చిన మ‌హ్మ‌ద్ బీన్ తుగ్ల‌క్ చిత్రంలో తొలిసారి న‌టించారు బాలు.

మ‌ల్లె పందిరి, ఓ పాప లాలి, క‌ళ్ళు, వివాహ భోజ‌నంబు, పెళ్లాడి చూపిస్తా, గొప్పింటి అల్లుడు, ప్రేమికుడు, మేజిక్ మేజిక్ 3డీ, మాయా బ‌జార్(2006), పెళ్లంటే నూరేళ్ల పంట‌, ప‌ద్మ‌వ్యూహం, శుభ‌ప్ర‌దం వంటి చిత్రాల‌లో త‌న న‌ట‌న‌తో ఎంత‌గానో అల‌రించారు. కేవ‌లం సౌత్ ప్రేక్ష‌కుల‌నే కాక ఉత్తరాది ప్రేక్ష‌కుల‌ను కూడా త‌న న‌ట‌న‌తో ఎంత‌గానో అల‌రించారు. 

చోర్ చోర్, హ‌మ్ సే హై ముఖాబ్‌లా, దునియా దిల్‌వాలోంకీ, స‌ప్నే వంటి డ‌బ్బింగ్ చిత్రాల‌తో పాటు చోటా జాదూగ‌ర్ అనే హిందీ భాషా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని మెప్పించారు. అయితే తాను  ప్రొఫెషనల్‌ నటుడిని కాదు అని బాలు స్వ‌యంగా చెప్ప‌డం విశేషం. మొద‌టి సారి త‌న‌లో న‌ట‌న‌ని చూసిన వారు బాగా చేస్తాడ‌ని ప్ర‌త్యేక‌మైన పాత్ర‌కు పిలిచార‌ట‌. ఇప్ప‌టికీ బాలుకు సంవ‌త్స‌రానికి నాలుగైదు ఆఫ‌ర్స్ వ‌స్తుంటాయ‌ట‌. ప్ర‌త్యేక‌మైన సీన్స్ చేయ‌డానికి చాలా ఇష్ట‌ప‌డుతుంటాను అని బాలు చాలా సార్లు చెప్పారు.