Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ నటుడిగా, మంచి మనసున్న వ్యక్తిగా ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా బాక్సాఫీస్ పరంగా విజయాలేమీ లేకపోయినా, సామాజిక సేవలో మాత్రం సూర్య అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఇందుకు ప్రధాన ఉదాహరణగా నిలిచింది ఆయన స్థాపించిన అగరం ఫౌండేషన్ . 2008లో ప్రారంభమైన అగరం ఫౌండేషన్ ఈ ఏడాది 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చెన్నైలో గ్రాండ్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ వేడుకకు సూర్యతో పాటు అతని భార్య జ్యోతిక, సోదరుడు కార్తీ, ప్రముఖ నటుడు కమల్ హాసన్, దర్శకుడు వెట్రిమారన్ తదితరులు హాజరయ్యారు.
ఈ వేడుకలో అగరం ఫౌండేషన్ సాయంతో చదువు పూర్తి చేసిన విద్యార్థులు స్టేజ్ పైకి వచ్చారు. ఇప్పటివరకు దాదాపు 8000 మంది విద్యార్థులు అగరం సాయంతో విద్యను పూర్తి చేసుకోగా, వీరిలో 1800 మంది ఇంజినీర్లు , 51 మంది డాక్టర్లు ఉన్నారు. ఈ ఫౌండేషన్ వల్ల తమ జీవితాలు ఎలా మారిపోయాయో అందరూ వేదికపై భావోద్వేగంతో పంచుకున్నారు. ఆ క్షణంలో హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఈ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు సూర్య చేస్తున్న సేవను కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అగరం ఫౌండేషన్ ప్రత్యేకత ఏమిటంటే, పేదలుగా, అనాథలుగా ఉన్న చిన్నారులను ఎంపిక చేసి వారికి కెజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడం. ఇందుకోసం సూర్య కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు, తన ఇంటినే అగరం స్కూల్‌కి కేటాయించడం కూడా ఆయన గొప్ప మనసుకే నిదర్శనం. సినిమాల్లో విజయాలు, వైఫల్యాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ.. ఒక మంచి మనిషి చేయగలిగిన మార్పు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. సూర్య చేస్తోన్న ఈ సేవ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది . అగరం ఫౌండేషన్ ద్వారా వెలుగులోకి వచ్చిన వేలాది విద్యార్థుల జీవితాల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు సూర్యపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.