గద్వాల, జనవరి 20 : అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు మల్లు రవి దాడి చేశాడు. ప్రొటోకాల్ విషయమై ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయి ‘ఎవడ్రా నువ్వు’ అంటూ ఎమ్మెల్యేను దూషించాడు. తోటి ప్రజాప్రతినిధి అనే గౌరవం లేకుండా విచక్షణ కోల్పోయి దౌర్జన్యం చేశాడు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడ్ గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణానికి ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు బీఆర్ఎస్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. భూమిపూజ కార్యక్రమంలో మొదట ఎంపీ కొబ్బరికాయలు కొట్టగా తర్వాత ఎమ్మెల్యే పనులు ప్రారంభించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ముందుకురావడంతో ప్రొటోకాల్ లేని వ్యక్తులతో ఎలా కొట్టిస్తారని ఎంపీని, ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన మల్లు రవి ‘ఎవడ్రా నువ్వు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే విజయుడును తోసేయడంతో పాటు అక్కడున్న వారితోనూ ఓ వీధి రౌడీలా ప్రవర్తించారు. దీంతో పోలీసులు ఎంపీని అదుపు చేశారు. సీనియర్ ఎంపీ రవి ఎమ్మెల్యేతో అమర్యాదగా మాట్లాడటాన్ని నియోజకవర్గ ప్రజలు తప్పుపడుతున్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి నడిగడ్డలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ అలజడి రేపుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇదే ఎంపీ గద్వాల నియోజకవర్గ ప్రజాప్రతినిధితో అమర్యాదగా మాట్లాడి, ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయిజ, జనవరి 20 : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో పోలీసులు బీఆర్ఎస్ నేతల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలో రూ.3.95 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు భూమిపూజ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే విజయుడు కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఒక్కసారిగా పోలీసులు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు నేరుగా పీఎస్‌కు చేరుకొని పార్టీ నాయకులను ఎందుకు అరెస్టు చేశారని సీఐ టాటాబాబును ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులకు తలొగ్గి బీఆర్ఎస్ కార్యకర్తలను ఏ విధంగా అరెస్టు చేస్తారని నిలదీశారు. కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అధికార బలంతో ప్రజాపాలన కొనసాగిస్తే కాంగ్రెస్ సర్కారు ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ నేతలను కట్టడం చేయలేరన్నారు.