Income Tax | వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవుల కోసం కొత్త ఐటీ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా సవరించారు. ఏటా రూ.12.75 లక్షలదాకా పన్నులుండబోవన్నారు. ఇది దాటితే మాత్రం రూ.4 లక్షల నుంచి శ్లాబులవారీగా పన్నులు వర్తిస్తాయి. అయితే సీటీసీ రూ.17.25 లక్షలున్నా కొత్త ఐటీ విధానం కింద పన్ను మినహాయింపును పొందే వీలున్నదని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి అందుకు ఏం చేయాలో తెలుసా?
సీటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ. ఇంకా సరళంగా చెప్పాలంటే ఓ కంపెనీ తమ ఉద్యోగికిచ్చే మొత్తం సాలరీ ప్యాకేజీ. ఇందులో బేసిక్ పే, ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ), ఆరోగ్య బీమా, ట్రావెల్ అలవెన్స్ (టీఏ), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) మొదలగున అన్ని అలవెన్సులు, సేవింగ్స్ విరాళాలు, ప్రత్యక్ష-పరోక్ష ప్రయోజనాలుంటాయి.
కొత్త ఐటీ విధానంలోనూ అలవెన్సులకు పన్ను మినహాయింపులుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ వాటికి అనుగుణంగా ఉద్యోగులు తమ వేతన నిర్మాణాన్ని మార్చుకుంటేనే ఆ ప్రయోజనాలను అందుకోవచ్చనివారు చెప్తున్నారు. నిజానికి ఈ అలవెన్సులకు అనుగుణంగా సాలరీ స్ట్రక్చర్‌ను మార్చుకోవచ్చని ఐటీ చట్టంలోనూ ఉందని గుర్తుచేస్తున్నారు. దీంతో సాధారణంగా వచ్చే అలవెన్స్, విరాళాలతోపాటు కొన్ని రీయింబర్స్మెంట్లను జోడిస్తే పన్ను సహిత ఆదాయాన్ని భారీగా తగ్గించుకోవచ్చు. ఇక ఈ రీయింబర్స్‌మెంట్‌లలో..
ఉద్యోగులు తమ నివాసం నుంచి పనిచేసే చోటుకు రావడానికి అయ్యే ఖర్చులకు పరిహారంగా కంపెనీలు చేసే అదనపు చెల్లింపులే ఈ కన్వీయన్స్ అలవెన్స్. ఈ అలవెన్స్‌ను క్లెయిం చేసుకోవడానికి ఉద్యోగులు ఆయా రవాణా ఖర్చుల బిల్లులను యాజమాన్యాలకు సమర్పించాల్సి ఉంటుంది.
టెలిఫోన్, ఇంటర్నెట్ వినియోగానికయ్యే ఖర్చులకూ ఉద్యోగులు తమ కంపెనీల్లో రీయింబర్స్మెంట్ పొందవచ్చు.
కొందరు ఉన్నతోద్యోగులకు ఆయా కంపెనీలు వాహనాలను వాడుకొనే వెసులుబాటు కల్పిస్తాయి. కార్లను లీజుకు తీసుకొని ఈ సౌకర్యాన్ని అందిస్తాయి. ఇంధనం, డ్రైవర్ ఖర్చులకుగాను ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ ఇస్తాయి.