Wipro | ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో మార్కెట్ అంచనాలను బ్రేక్ చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సర డిసెంబర్ త్రైమాసికంలో 24.4 శాతం వృద్ధితో రూ.3,354 కోట్ల నికర లాభం గడించింది. త్రైమాసికం ప్రాతిపదికన విప్రో 4.6 శాతం లాభాలు పొందింది. అయితే కంపెనీ ఆదాయం మాత్రం స్వల్పంగా 0.5శాతం వృద్ధితో రూ.22,319 కోట్లుగా కొనసాగింది. మార్కెట్ అంచనాలను బ్రేక్ చేసిన నేపథ్యంలో వాటాదారులకు విప్రో తన షేర్‌పై రూ.6 ఇంటరిమ్ డివిడెండ్ ఇస్తున్నట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అయితే, మార్చి త్రైమాసికం గైడెన్స్ ప్రకారం నికరలాభం ఒకశాతం తగ్గొచ్చునని అంచనా వేసింది. ఐటీ సర్వీసెస్ బిజినెస్ నుంచి 2,602 మిలియన్ల డాలర్ల నుంచి 2,665 మిలియన్ల డాలర్ల మధ్య ఆదాయం లభిస్తుందని పేర్కొంది. గత 12 నెలల్లో సంస్థ నుంచి ఉద్యోగుల అట్రిక్షన్లు 15.3శాతంగా నమోదయ్యాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో 14.5 శాతం అట్రిక్షన్లు రికార్డయ్యాయి.
ఇక షేర్‌పై రూ.6 ఇంటరిం డివిడెండ్ జారీకి ఈ నెల 28వ తేదీని ఖరారు చేసినట్లు విప్రో తెలిపింది. వచ్చేనెల 15న ఇంటరిం డివిడెండ్ చెల్లిస్తుంది. ఇంతకు ముందు 2023 జనవరి, 2024 జనవరిల్లో రూపాయి,2022 ఏప్రిల్‌లో రూ.5 ఇంటరిం డివిడెండ్ చెల్లించింది. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో శుక్రవారం విప్రో షేర్ 2.15 శాతం పతనంతో రూ.281.85 వద్ద ముగిసింది. బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.288.05 నుంచి రూ.280.75 మధ్య తచ్చాడింది.