Gold Bonds | న్యూఢిల్లీ, ఆగస్టు 23: కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)కు గుడ్‌బై చెప్పనుందా?.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వాటి జారీని ఇక నిలిపివేయనుందా?.. ఈ ప్రశ్నలకు అధికార వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తున్నదిప్పుడు. ఎస్‌జీబీలు వ్యయభరితం, సంక్లిష్ట సాధనాలుగా మారడంతో వాటి అమ్మకాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి కేంద్రం వస్తున్నట్టు సంబంధిత వర్గాలు ప్రముఖ జాతీయ వార్తా చానెల్ సీఎన్‌బీసీ-టీవీ18తో అన్నాయి. కాగా, ఎస్జీబీలకు ఇన్వెస్టర్లలో నానాటికీ పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతున్నది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలో 10 శాతం ఎక్కువ చెల్లించైనా కొనేందుకు ముందుకొస్తున్నారు. భౌతిక బంగారంతో పోలిస్తే నిల్వ, చోరి వంటి ఇబ్బందుల్లేకపోవడం, ఏటా స్థిరంగా 2.5 శాతం వడ్డీ రాబడులుండటం, పన్ను మినహాయింపులకూ వీలుండటమే ఇందుకు కారణం. ఇక ధరల విషయానికే వస్తే.. మార్కెట్లో బంగారం ధరలు ఏ స్థాయిలో పరుగులు పెడుతున్నాయో చూస్తూ నే ఉన్నాం. 2015తో పోల్చితే ఇప్పుడు బంగారం ధర 180 శాతం ఎగిసింది. దీంతో ఎస్‌జీబీల్లో పెట్టుబడులు పెట్టినవారికి విపరీతమైన లాభాలొస్తున్నాయి. 2015 నవంబర్‌లో తొలి విడుత బాండ్ల జారీ గ్రాము రూ.2,684 వద్ద జరిగింది. కానీ అదే బాండ్ కాలపరిమితి తీరినప్పుడు గ్రాముకు రూ.6,132 చెల్లిం చాల్సి వచ్చింది. ఇలా ప్రతీ విడుతలో మెచ్యూరిటీ చెల్లింపులకు ఖాజానాపై భారం పడుతూనే ఉన్నది. దీన్ని గుర్తించే ఇక ఈ బాండ్లు లాభసాటి కాదని ప్రభుత్వం వీటికి దూరంగా ఉండాలని చూస్తున్నదంటున్నారు.
గడిచిన దాదాపు 9 ఏండ్లలో ఆర్బీఐ ఇప్పటిదాకా మొత్తం 67 విడుతల్లో ఎస్జీబీలను జారీ చేసింది. వీటిల్లో మదుపరులు రూ.72,274 కోట్ల పెట్టుబడుల్ని పెట్టారు. కాగా, తొలి 4 విడుతల్లో జారీ చేసిన ఎస్‌జీబీల కాలపరిమితి ఇప్పటికే పూర్తిస్థాయిలో తీరిపోయింది. వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా మదుపరులకు జరిగిపోయాయి. అయితే పెట్టిన పెట్టుబడులకు రెట్టింపునకుపైగా రాబడులను ఇన్వెస్టర్లు పొందారు.
2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్లు పరిచయమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తున్నది. ఇందులో బంగారంపై మదుపరులు చేసే పెట్టుబడులు పేపర్ల రూపంలోనే ఉంటాయి. దేశంలోకి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్న పసిడికి అడ్డుకట్ట వేయడానికే ఈ ఎస్‌జీబీల అమ్మకానికి మోదీ సర్కారు వచ్చింది.
బాండ్లు జారీ చేసేటప్పుడు ఆర్బీఐ వాటి ధరను నిర్ణయిస్తుంది. ఈ ఇష్యూ ప్రైస్ ప్రకారమే ఇన్వెస్టర్లు గ్రాముల లెక్కన కొనాల్సి ఉంటుంది. కాలపరిమితి 8 ఏండ్లు. అయినప్పటికీ ఐదేండ్లు గడిచిన తర్వాత ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. 24 క్యారెట్ బంగారానికిగాను భారతీయ బులియన్, జ్యుయెల్లర్స్ అసోసియేషన్ లిమిటెడ్ రోజూ సూచించే ధరల్లో చివరి మూడు రోజుల ధరల సగటు ప్రకారం ఇన్వెస్టర్లకు వారి పెట్టుబడులపై చెల్లింపులు జరుగుతాయి.
భారతీయ పౌరులు, ట్రస్టులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఛారిటబుల్ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఎస్జీబీలను కొనవచ్చు.
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు) ఈ బాండ్లను అమ్ముతాయి. ఎస్‌హెచ్‌సీఐ, పోస్టాఫీస్‌లు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలూ విక్రయిస్తున్నాయి. అన్ని ఎస్‌జీబీలు సెకండరీ మార్కెట్లో నమోదవుతాయి. డీమ్యాట్ ఖాతాల ద్వారా క్రయవిక్రయాలు జరుగుతా యి. స్టాక్ ఎక్సేంజీలపై ఎస్‌జీబీల అమ్మకంపై వచ్చే సొమ్ముకు పన్ను ఉంటుంది.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా ధరలు దిగిరావడం విశేషం. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.74 వేల దిగువకు చేరుకున్నది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.73, 800కి దిగొచ్చినట్లు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతక్రితం ధర రూ.74,150గా ఉన్నది. పసిడితోపాటు వెండి రూ.200 తగ్గి రూ.87 వేలకు తగ్గింది. యూఎస్ ట్రెజరీ ఈల్డ్ పుంజుకోవడం, డాలర్ మరింత బలోపేతం కావడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని వెల్లడించారు.