Banks | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే ఎగవేతదారుల (విల్‌ఫుల్ డిఫాల్టర్స్) సంఖ్య అప్పు ఇంతితై వటుడింతై..అన్నట్లు ఏటా పెరుగుతున్నదే కాని తగ్గటం లేదు. సామాన్యులను ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులు ఉద్దేశపూర్వకంగా రుణాలు కట్టని బడాబాబులను ఏమీ చేయకుండా చోద్యం చూస్తున్నాయి.
బ్యాంక్‌లు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజా గణాంకాల ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ ప్రధాన బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన రుణాలు ఒక్క ఏడాదిలోనే రూ.75,294 కోట్ల నుంచి రూ.88,435 కోట్లకు పెరిగింది. ఎగవేతదారులకు రుణాలిచ్చిన బ్యాంక్‌ల జాబితాలో హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నెషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. ఉద్దేశపూరిత ఎగవేత దారుల జాబితాలో గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ.7,848 కోట్ల బకాయితో అగ్రస్థానంలో ఉంది.
బ్యాంకులు తమ ఎన్పీఏలను తగ్గించి చూపించుకోవడానికి ఈ ఉద్దేశపూరక ఎగవేత దారుల రుణాలను రైటాఫ్‌లు( ఖాతా పుస్తకాల నుంచి తొలగించడం చేస్తాయి. బ్యాంక్‌లు రికవరీ చేయలేని రుణాల్ని ఇలా రైటాఫ్ చేస్తుంటాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 లక్షల కోట్ల రుణాల్ని రైటాఫ్ చేయగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 67,214 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 50,514 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్ రూ.45,650 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 34,782 కోట్ల చొప్పున మొండి బకాయిల్ని రైటాఫ్ చేశాయి. కానీ బ్యాంకులు ఎన్పీఎలు రద్దు చేసినపుడు డిపాజిటర్లకే పరోక్షంగా దెబ్బ తగులుతున్నది.
బ్యాంకులు తమ నష్టాన్ని పూడ్చుకోవడానికి రుణాలపై వడ్డీ రేట్లను పెంచడం, వివిధ రకాలుగా తమ సేవలకు అధిక ఫీజుల్ని వసూలు చేస్తున్నాయి. రైటాఫ్ చేయడం సరైన పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు. దేశంలో బ్యాంక్ డిఫాల్టర్ల నుంచి రికవరీ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుందని, అలా కాకుండా దివాలా చట్టాన్ని ఉపయోగించుకుని, త్వరితంగా ఉద్దేశ పూర్వక ఎగవేత దారుల ఆస్తుల విక్రయించి రుణాల వసూలు చేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ సిన్హా అభిప్రాయపడ్డారు.
Jump1