Akhanda 2 | బాలకృష్ణ కెరీర్లో ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో ప్రీమియర్ షోలు ప్రారంభమవుతాయని అభిమానులు థియేటర్ల వద్ద భారీగా చేరి సంబరాలకు సిద్ధమవుతున్న తరుణంలో, హఠాత్తుగా ‘అఖండ 2’ విడుదల ఆగిపోవటం షాక్‌కు గురిచేసింది. డిసెంబర్ 5న చిత్రం విడుదల కాదన్న అధికారిక ధృవీకరణ అర్థరాత్రి వెలువడడంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. ముందు ప్రీమియర్ షోస్ రద్దు అయ్యాయని తెలియజేసిన చిత్ర నిర్మాణ సంస్థ ఆ తర్వాత మూవీని కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ‘‘అనివార్య కారణాల వల్ల అఖండ 2 షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు అని మేకర్స్ స్పష్టం చేశారు.
అయితే ఈ విషయం పట్ల మేము ఎంతగానో చింతిస్తున్నాం. ప్రతి ఒక్క సినీ అభిమాని నిరాశను మేము అర్ధం చేసుకుంటాము.వీలైనంత త్వరగా ఈ సమస్య సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. ఈ నిర్ణయం పట్ల కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో సానుకూల నిర్ణయంతో మీ ముందుకు వస్తామని నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేసింది. అయితే ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, విడుదల వాయిదా వెనుక పలు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నట్లు తెలుస్తోంది. ‘దూకుడు’ చిత్రం మంచి లాభాలు పొందనప్పటికీ, అప్పటినుంచి కొనసాగుతున్న ఎరోస్ ఇంటర్నేషనల్‌తో ఉన్న ఫైనాన్షియల్ లావాదేవీ వివాదాలు ఇంకా క్లియర్ కాలేదని అంటున్నారు. అలాగే ‘ఆగడు’, ‘1 నేనొక్కడినే’ వంటి పాత చిత్రాలకు సంబంధించిన బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయట.
14 రీల్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘సర్కారు వారి పాట’ సోలో ప్రొడక్షన్ కాకపోవడం వలన అది సమస్యల నుండి తప్పించుకున్నట్టు టాక్. అయితే ఎరోస్ సంస్థ అఖండ 2 కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుండగా, విడుదలకు గంటల ముందు ఈ ఇష్యూస్‌ను లేవనెత్తడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైందని సమాచారం. విడుదల వాయిదా పడుతుండటంతో కొందరు సినీ పెద్దలు రాత్రికి రాత్రే జోక్యం చేసుకున్నప్పటికీ, 28 కోట్ల భారీ మొత్తం కారణంగా చర్చలు ఫలించలేదని తెలుస్తోంది. అదనంగా మద్రాస్ హైకోర్టు నుంచి సంబంధించిన క్లియరెన్స్ వచ్చే వరకు అఖండ 2 రిలీజ్‌కు అవకాశం లేదని ఇండస్ట్రీ టాక్. నిర్మాతలు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు. డిసెంబర్ 12, 19 లేదా 25 తేదీల్లో ఏదో ఒక దినాన్ని లాక్ చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 విడుదలపై అధికారిక ప్రకటన త్వరలోనే రావచ్చని సమాచారం.