హైదరాబాద్, డిసెంబర్ 4: రాష్ట్రానికి చెందిన ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ కంపెనీ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకోగా, త్వరలో అనుమతి లభించే అవకాశం ఉన్నదని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కే అనిల్ కుమార్ తెలిపారు. గ్రీన్ సిగ్నల్ వచ్చిన నెల రోజుల్లోనే వాటాలను విక్రయించనున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈ ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ. 405 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్నది. దీంట్లో రూ.280 కోట్లను నూతన షేర్లను జారీ చేయడం ద్వారా, మరో రూ.125 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించడం ద్వారా సేకరించనున్నది. ఇలా సేకరించిన నిధుల్లో రూ.110 కోట్లను ప్లాంట్లను ఆధునీకరించడానికి, హైదరాబాద్లో ఆర్ అండ్ డీ సెంటర్ను నెలకొల్పడానికి రూ.25 కోట్లు కేటాయించనున్నది. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్లోని జీడిమెట్ల వద్ద నాలుగు ప్లాంట్లు ఉన్నాయి.