ఇస్లామాబాద్: ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్(Asim Munir) మరింత శక్తివంతంగా తయారయ్యారు. రక్షణ దళాలకు తొలి చీఫ్‌గా ఆయన్ను నియమిస్తూ పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి ఆదేశాలు జారీ చేశారు. అయిదేళ్ల పాటు అసిమ్ మునీర్ .. సీడీఎఫ్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్)గా కొనసాగనున్నారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పదవి కోసం మునీర్ పేరును పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనకు ఆమోదం దక్కినట్లు పాక్ అధ్యక్ష కార్యాలయం తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పాత్రను ఇటీవల పాకిస్థాన్ క్రియేట్ చేసింది. రాజ్యాంగంలో 27వ సవరణ ద్వారా గత నెలల ఈ పాత్రను ఏర్పాటు చేసింది. మిలిటరీ కమాండ్‌ను కేంద్రీకృతం చేసేందుకు పాక్ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. అసిమ్ మునీర్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాలని షెహబాజ్ సర్కారు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నది. వాస్తవానికి నవంబర్ 29వ తేదీన ఆర్మీ చీఫ్‌గా మునీర్ మూడేళ్ల కాలపరిమితి ముగిసింది. ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దు సర్వీసును కూడా మరో రెండేళ్లకు పొడిగించారు. పాక్ సైనిక బలగాల ఆఫీసర్లు ఇద్దరికీ అసిప్ అలీ జర్దారి బెస్ట్ విషెస్ చెప్పారు.