Grace Hayden : యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ఏళ్లుగా ఊరిస్తున్న శతకాన్ని ఎట్టకేలకు సాధించాడు జో రూట్ (Joe Root). గబ్బా స్టేడియంలో పింక్ బాల్ టెస్టులో సూపర్ సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు రూట్. ఆసీస్ బౌలర్లను విసిగిస్తూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన రన్ మెషీన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ (Mathew Hayden) అయితే ఇంగ్లండ్ స్టార్‌కు మరీమరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ లెజెండ్ కూతురు గ్రేస్ సైతం రూట్‌కు ధన్యవాదాలు చెప్పింది. వీరిద్దరూ ప్రత్యేకంగా రూట్‌ను అభినందించడానికి ఓ కారణముంది.
యాషెస్ సిరీస్‌కు ముందు భారత జట్టుపై మూడు సెంచరీలతో ఫామ్ చాటుకున్నాడు జో రూట్. అదే ఊపులో ఆసీస్ గడ్డపై గబ్బా వేదికగా తనసెంచరీ కలను సాకారం చేసుకున్నాడు రూట్. చివరి వికెట్ పడకుండా ఇంగ్లండ్ స్కోర్ 300 దాటించిన రూట్‌పైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోపంగా ఉన్నవేళ మాథ్యూ హేడెన్ మాత్రం ప్రశంసలు కురిపించాడు. ‘ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ కొట్టినందుకు అభినందనలు. క్రికెట్లో నా అంత మందమైన చర్మం మరొకరికి లేదు. అయితే.. నేను మంచి ఉద్దేశంతోనే న్యూడ్ వాక్ ఛాలెంజ్ చేశాను. నువ్వు వంద చేసి నా పరువు కాపాడావు కాబట్టి అభినందనలు. పది ఫిఫ్టీల తర్వాత ఎట్టకేలకు సెంచరీ సాధించావు’ అని రూట్ సెంచరీపై హేడెన్ స్పందించాడు.
🤳 (1) 𝗜𝗻𝗰𝗼𝗺𝗶𝗻𝗴 𝗺𝗲𝘀𝘀𝗮𝗴𝗲@HaydosTweets has something he’d like to say to Joe Root 😅 pic.twitter.com/0yPGk7JC5S
— England Cricket (@englandcricket) December 4, 2025
యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు ‘ఆల్ ఓవర్ బార్ ది క్రికెట్’ అనే పాడ్‌కాస్ట్ షోలో మాథ్యూ హేడెన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘యాషెస్ ఆల్‌టైమ్ జట్టు’లో రూట్ పేరు లేకపోవడాన్ని అతడు తప్పుపట్టాడు. ఫ్యాబ్ -4లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న రూట్‌ను పక్కన పెట్టడం అవివేకమని హేడెన్ అన్నాడు. అంతటితో ఆగకుండా ఎవరూ ఊహించని కామెంట్ చేశాడీ వెటరన్. యాసెస్లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ సెంచరీ (Joe Root) చేయకుంటే తాను మెల్బోర్న్ క్రికెట్ మైదానం(MCG)లో నగ్నంగా నడుస్తానని వెల్లడించాడు. ‘ఇంగ్లండ్ స్క్వాడ్‌లో అన్నివిధాల ఉపయుక్తమైన క్రికెటర్ రూట్. మీరు అతడిని ఆల్‌టైమ్ టీమ్‌లో తీసుకోకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.
Mathew Hayden will be a delighted man after Joe Root’s first hundred on Australian soil 😜 pic.twitter.com/QXWKmYQlKS
— CricShadows (@cricshadows) December 4, 2025
ప్రస్తుతం రూట్ సగటు 40. అత్యధిక స్కోర్ 180. ఈ వేసవిలో ఆసీస్‌పై అతడు సెంచరీ కొట్టకుంటే నేను ఎంసీజీలో నగ్నంగా నడుస్తాను’ అని ఆల్ఓవర్ బార్ ది క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో హేడెన్ పేర్కొన్నాడు. హేడెన్ చేసిన కామెంట్స్‌పై అతడి కూతురు గ్రేస్ హ్యారిస్ ఫన్నీగా స్పందించింది. ‘ప్లీజ్ రూట్.. సెంచరీ కొట్టు’ అని కామెంట్ చేసింది. గబ్బాలో రూట్ సెంచరీ కొట్టడంతో ఖుషీ అయిన గ్రేస్.. ఇంగ్లండ్ స్టార్‌కు ధన్యవాదాలు తెలిపింది. ‘రూట్ నీకు ధన్యవాదాలు. నువ్వు మా అందరి కళ్లను కాపాడావు’ అని గ్రేస్ పోస్ట్ పెట్టింది.
Grace Hayden’s reaction on Joe Root’s hundred 😂 pic.twitter.com/SoRUluBPTv
— The Brevis (@Ben10Brevis) December 4, 2025
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో మూడు సెంచరీలతో కదం తొక్కిన రూట్.. ఒకే ఒక ఇన్నింగ్స్‌తో దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, జాక్వెస్ కలిస్, రికీ పాంటింగ్ రికార్డులు బద్ధలు కొట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న అతడు కచ్చితంగా యాషెస్ సిరీస్‌లో వంద కొడుతాడనే ధీమాతోనే హేడెన్ ‘న్యూడ్ వాక్’ కామెంట్ చేశాడు. అయితే… ఆస్ట్రేలియాపై రూట్ రికార్డు ఏమంత ఘనంగా లేదు. గత 27 ఇన్నింగ్స్‌ల్లో 35.68 సగటుతో 892 రన్స్ చేశాడంతే. మూడుసార్లు రూట్ 80 ల్లోనే ఔటయ్యాడు. అందుకే.. హేడెన్ అంచనా తప్పుతుందని.. అతడిని మెల్బోర్న్లో నగ్నంగా చూడాల్సి వస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ.. రూట్ తన క్లాస్ ఆటతో 181 బంతుల్లో సెంచరీ సాధించాడు.