న్యూఢిల్లీ, డిసెంబర్ 4 : విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా తమ పెట్టుబడులను వెనక్కితీసుకుంటున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.13,121 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు లేదా 17.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తరలించుకుపోయారని ఎన్ఎస్డీఎల్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అలాగే నవంబర్ నెలలో రూ.3,765 కోట్లు వెనక్కి తీసుకున్నారు. వరుసగా మూడు నెలల పాటు భారీ స్థాయిలో నిధులను వెనక్కితీసుకున్న ఎఫ్ఐఐలు అక్టోబర్‌లో రూ.14,610 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం.
సెప్టెంబర్‌లో రూ.23,885 కోట్లు, ఆగస్టులో రూ.34,990 కోట్లు, జూలై నెలలో రూ.17,700 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. ఇదే క్రమంలో డిసెంబర్ నెల తొలి నాలుగు రోజులు 1 నుంచి 4 వరకు ఏకంగా రూ.13,121 కోట్లు కోట్లను వెనక్కి తీసుకున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనంగా ఉండటంతో ఎఫ్ఐఐల్లో ఆందోళన నెలకొన్నది, ఫలితంగా ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్టు దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, అమెరికా-భారత్ దేశాల వాణిజ్య ఒప్పందం కొలిక్కి రాకపోవడం కూడా మరో కారణం.
స్టాక్ మార్కెట్ల వరుస పతనానికి బ్రేక్‌పడింది. టెక్నాలజీ, ఐటీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. ఇంట్రాడేలో 400 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 158.51 పాయింట్లు అందుకొని 85,265.32 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 26 వేల మార్క్‌ను తిరిగి అధిగమించింది. చివరకు 47.75 పాయింట్లు అందుకొని 26,033.75 వద్ద స్థిరపడింది. గత నాలుగు వరుస సెషన్లలో సెన్సెక్స్ 613 పాయింట్లు, నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ తదితర షేర్లు లాభాల్లో ముగిశాయి.