ముంబై, డిసెంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వృద్ధిరేటు అంచనాను తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్ ప్రకటించడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా ఐదు రోజులపాటు లాభాల్లో కదలాడిన సూచీలు చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. 400 పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 56.74 పాయింట్ల నష్టంతో 81,709.12 వద్ద ముగిసింది. గత ఐదు సెషన్లలో సూచీ 2,722.12 పాయింట్లు లేదా 3.44 శాతం లాభపడిన విషయం తెలిసిందే. మరో సూచీ నిఫ్టీ 30.60 పాయింట్లు కోల్పోయి 24,677.80 వద్ద స్థిరపడింది. సెంట్రల్ బ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించడంతో మార్కెట్లోకి మరిన్ని నిధులు చొప్పించనున్నది. తీవ్ర ఊగిసలాటలో కొనసాగిన షేర్లు చివరి వరకు ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి.