మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 31, 2020 , 02:12:25

పసిడికి నో డిమాండ్‌

పసిడికి నో డిమాండ్‌

  • దేశంలో భారీగా పడిపోయిన కొనుగోళ్లు
  • ఏప్రిల్‌-జూన్‌లో 70 శాతం తగ్గిన ఆదరణ

ముంబై, జూలై 30: దేశంలో బంగారానికి ఆదరణ కరువైంది. ఈ ఏప్రిల్‌-జూన్‌లో 70 శాతం పడిపోయినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలియజేసింది. కరోనా వైరస్‌ ఉద్ధృతి, లాక్‌డౌన్‌, అధిక ధరల మధ్య గోల్డ్‌ డిమాండ్‌ 63.7 టన్నులకే పరిమితమైనట్లు డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్‌ వెల్లడించారు. గతేడాది ఇదే త్రైమాసికంలో 213.2 టన్నులుగా ఉన్నట్లు తమ ‘క్యూ2 గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌' నివేదికలో పేర్కొన్నారు. విలువ ప్రకారం డిమాండ్‌ 57 శాతం తగ్గి రూ.62,420 కోట్ల నుంచి రూ.26,600 కోట్లకు దిగజారినట్లు తెలిపారు.

డబ్ల్యూజీసీ నివేదిక ముఖ్యాంశాలు

  • దేశంలో ఆభరణాల డిమాండ్‌ 74 శాతం క్షీణించి 44 టన్నులకు పరిమితం. నిరుడు ఏప్రిల్‌-జూన్‌లో 168.6 టన్నులుగా ఉన్నది. కరెన్సీలో నగల డిమాండ్‌ రూ.49,380 కోట్ల నుంచి రూ.18,350 కోట్లకు దిగింది. 
  • మొత్తం పెట్టుబడుల డిమాండ్‌ 56 శాతం పతనమై 44.5 టన్నుల నుంచి 19.8 టన్నులకు తగ్గింది. 
  • దేశంలో మొత్తం రీసైకిల్డ్‌ గోల్డ్‌ 64 శాతం పడిపోయి 13.8 టన్నులకే పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌-జూన్‌లో ఇది 37.9 టన్నులుగా ఉన్నది. లాక్‌డౌన్‌తో రిఫైనరీలు మూతబడ్డాయి.
  • ఈ ఏప్రిల్‌-జూన్‌లో దేశంలోకి పసిడి దిగుమతులు 95 శాతం తగ్గాయి. గతేడాది ఇదే వ్యవధిలో 247.4 టన్నులుగా ఉన్న బంగారం దిగుమతులు.. ఈసారి 11.6 టన్నులుగానే ఉన్నాయి.
  • మొత్తం ఈ ఏడాది జనవరి-జూన్‌లో దేశంలో గోల్డ్‌ డిమాండ్‌ గతంతో పోల్చితే 56 శాతం క్షీణించి 165.6 టన్నులుగానే ఉన్నది. 
  • ఏప్రిల్‌-జూన్‌లో ప్రపంచ గోల్డ్‌ డిమాండ్‌ 11 శాతం తగ్గి 1,015.7 టన్నులుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో 1,136.9 టన్నులుగా ఉన్నది.


logo