Hindenburg Research | హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research).. ఇది అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌పై (Adani Group) హిండెన్‌బర్గ్ నివేదిక ఏ స్థాయిలో ప్రకంపనల్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ కార్పొరేట్ వర్గాల నుంచి రాజకీయ రంగందాకా ఈ అంశం కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ దెబ్బకి అదానీ షేర్లు కుదేలయ్యాయి. ఈ సంస్థ రిపోర్ట్ భారత స్టాక్ మార్కెట్లను కూడా వణికించింది. అయితే, తాజాగా హిండెన్‌బర్గ్‌ను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ (Nathan Anderson) తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో హిండెన్‌బర్గ్ గురించి కొన్ని విషయాలు మీకోసం..
ఏమిటీ ‘హిండెన్‌బర్గ్’ సంస్థ?
అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అవకతవకలు, మోసాలను గుర్తించడం, పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్‌లను విశ్లేషించడం దీని పని. ఆర్థికరంగంలో ఉద్దేశపూర్వకంగా సృష్టించే కృత్రిమ విపత్తులను గుర్తించడమే తమ పని అని కంపెనీ వెబ్సైట్లో స్వయంగా వెల్లడించింది. అంతేకాదు ఈ కంపెనీ షార్ట్‌సెల్లింగ్‌లో కూడా పెట్టుబడులు పెడుతుంది.
2017లో ఏర్పాటు
‘హిండెన్‌బర్గ్’ కంపెనీని 2017లో నాథన్ అండర్సన్ (38) ఏర్పాటు చేశారు. అమెరికాలోని కనెక్టికట్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లు ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేశాడు. తిరిగి అమెరికాకు వచ్చాక ఫ్యాక్ట్ సెట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు. కంపెనీల్లో జరిగే ఆర్థిక అవకతవకలను గుర్తించటంలో అండర్సన్‌కు మంచి పట్టు ఉంది. కార్పొరేట్ ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణంగా చెప్పుకొనే బెర్నీ మడాఫ్ మోసపూరిత లావాదేవీల గుట్టును విప్పిన వారిలో ఒకరైన హరీ మార్కోపోలోస్‌తో కలిసి అండర్సన్ ‘ప్లాటినం పార్ట్నర్స్’ అనే సంస్థపై దర్యాప్తు కోసం కలిసి పనిచేశారు. ఇదే సమయంలో షార్ట్ సెల్లింగ్, పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్‌లను విశ్లేషించడం, ఆర్థిక మోసాల గురించి లోతుగా అధ్యయనం చేశాడు. ఆ తర్వాతే హిండెన్‌బర్గ్ కంపెనీని ఏర్పాటు చేశాడు.
హిండెన్‌బర్గ్ నెట్వర్క్ ఏమిటి?
హిండెన్‌బర్గ్ సంస్థలో వాస్తవంగా పనిచేసేది తొమ్మింది మంది ఉద్యోగులే. అయినప్పటికీ, 60కి పైగా దేశాల్లోని మాజీ టాప్ బ్యూరోక్రాట్లు, కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులు, ఆర్థిక సంస్థలతో ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’కు మంచి సంబంధాలు ఉన్నాయి. వికీలీక్స్, ఐసీఐజే నేతృత్వంలో బయటపడ్డ పాండోరా పేపర్స్, పెగాసస్, పనామా పేపర్స్ ఉదంతాల్లో కీలకపాత్ర పోషించిన టీమ్.. హిండెన్‌బర్గ్‌కు అనుబంధ సేవలు అందిస్తాయని వార్తలు వచ్చాయి.
హిండెన్‌బర్గ్ విశ్వసనీయత ఏమిటి?
హిండెన్‌బర్గ్ ఏదైనా కంపెనీని లక్ష్యంగా చేసుకొంటే తొలుత ఆరు నుంచి రెండేండ్లకు పైగా ఆ కంపెనీకి సంబంధించిన పబ్లిక్ రికార్డులు, అంతర్గత కార్పొరేట్ పత్రాలను పరిశీలించి, కంపెనీ ప్రస్తుత, మాజీ ఉద్యోగుల ద్వారా సమాచారం సేకరిస్తుంది. ఆ తర్వాత హిండెన్‌బర్గ్‌తో కలిసి పనిచేసే బయటి బృందానికి వాటిని చేరవేస్తుంది. తర్వాత ఆ బృందం సదరు కంపెనీ షేర్లలో షార్ట్ పొజిషన్లు తీసుకొంటాయి. ఇలా.. అక్రమాలకు పాల్పడుతున్నట్టు అనుమానం ఉన్న కంపెనీలో పరోక్షంగా షేర్లను కొనుగోలు చేసి.. అసలు వాస్తవాలను రాబట్టడం హిండెన్‌బర్గ్ విధానం. ఇలా 2017 నుంచి ఇప్పటివరకూ 16కు పైగా కంపెనీలను లక్ష్యంగా చేసుకొని ఆయా కంపెనీలు అవకతవకలకు పాల్పడ్డట్టు హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఇందులో 99 శాతం కేసుల్లో (అదానీ గ్రూప్‌పై అంశం కాకుండా) ఆరోపణలు నిజమని రుజువైంది.
దివాళా అంచుకు చేరాల్సిందే..
2020లో అమెరికాలోని నికోలా మోటర్ కంపెనీపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది. నికోలా మోటర్ కంపెనీ పేర్కొన్నట్టు ఎలక్ట్రిక్ ట్రక్కుల వేగానికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయని, నిజాలు దాస్తూ.. ఇన్వెస్టర్లను, కస్టమర్లను సదరు కంపెనీ మోసపుచ్చుతున్నదని ‘హిండెన్‌బర్గ్’ ఆరోపించింది. కంపెనీలో అవకతవకలు జరిగినట్టు అనంతరం జరిపిన దర్యాప్తులో బయటపడటంతో కంపెనీ స్టాక్ విలువ 56 శాతం మేర పతనమైంది.
‘హిండెన్‌బర్గ్’ ఆరోపణలు సంచలనంగా మారడంతో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) రంగంలోని దిగింది. తమ దర్యాప్తులోనూ కంపెనీలో మోసం జరిగినట్టు గుర్తించారు. దీంతో కంపెనీ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కంపెనీ దివాళా తీసే స్థాయికి చేరింది. దీంతో సబ్సిడరీస్తో కలిపి కంపెనీ పేరును నికోలా కార్పొరేషన్‌గా మార్చారు. లార్డ్స్టోన్ మోటార్స్ కార్ప్ (యూఎస్), కండి (చైనా), క్లోవర్ హెల్త్ (యూఎస్), టెక్నోగ్లాస్ (కొలంబియా), ఆన్లైన్ బెట్టింగ్ ఆపరేటర్ ‘డ్రాఫ్ట్‌కింగ్స్’, జియోథర్మల్ పవర్‌ప్లాంట్స్ ‘ఓర్మట్ టెక్నాలజీస్’, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ‘మెల్లెన్ టెక్నాలజీస్’, చైనాకు చెందిన బ్లాక్‌చైన్, క్రిప్టోమైనింగ్ కంపెనీ ‘ఎస్‌వోఎస్’లో అవకతవకలను హిండెన్‌బర్గ్ గుర్తించింది. అనంతర కాలంలో ఇవి దాదాపుగా నిజమేనని తేలింది.
రూ.12 లక్షల కోట్లు ఆవిరి
ఇక రెండేళ్ల క్రితం హిండెన్‌బర్గ్ రిసెర్చ్.. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతున్నదని, స్టాక్ మార్కెట్లలో గ్రూప్ కంపెనీల షేర్ల విలువ పెరిగేలా అక్రమాలకు దిగుతున్నదని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా రూ.12 లక్షల కోట్లు హరించుకుపోయింది. అదానీ సంస్థల్లో ఆయా కంపెనీల పెట్టుబడులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ కొన్న వాటాలపై పెద్ద ఎత్తున దుమారం రేగినది విదితమే. చివరకు అదానీ వ్యాపార విస్తరణకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సహకరించిందని, దీనిపై లోతుగా దర్యాప్తు జరుగాలని పార్లమెంట్లో విపక్షాలన్నీ పట్టుబట్టినదీ తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యం వరకు వెళ్లింది కూడా.
Also Read..
Hindenburg Research | అదానీపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
Repo Rate | వడ్డీరేట్లు తగ్గితేనే వృద్ధి.. ఆలస్యమైతే ఆర్థిక వ్యవస్థకు నష్టమే: డ్యూషే బ్యాంక్
Import Duties | దిగుమతికి సుంకం పోటు?.. డాలర్ల డిమాండ్‌ను అరికట్టే దిశగా కేంద్రం అడుగులు!