Repo Rate | ముంబై, జనవరి 15: వచ్చే నెలలో జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పావు శాతమైనా (25 బేసిస్ పాయింట్లు) తగ్గించాల్సిన అవసరం ఉన్నదని డ్యూషే బ్యాంక్ విశ్లేషకులు చెప్తున్నారు. వడ్డీరేట్ల కోతల్ని ఆలస్యం చేసినకొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమేనని వారు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఇప్పటికైనా రెపోరేటును తగ్గించకపోతే మున్ముందు జీడీపీ వృద్ధిరేటును మరింతగా త్యాగం చేసినట్టవుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
‘రాబోయే ఫిబ్రవరి, ఏప్రిల్ ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును 0.25 శాతం చొప్పున ఆర్బీఐ తగ్గిస్తుందని మేము భావిస్తున్నాం. ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో రెపోరేటు 6 శాతానికి దిగొస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు. వడ్డీరేట్ల కోతలు ప్రభావం చూపాలంటే భారత్‌లో 9 నెలలు పడుతుందని, ఫిబ్రవరి సమీక్షలో కోతలకు శ్రీకారం చుడితే ఆర్బీఐ సరైన నిర్ణయం తీసుకున్నట్టవుతుందని పేర్కొన్నారు.
‘గత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో వరుసగా గడిచిన 11 ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో దేశ జీడీపీ వృద్ధిరేటు చాలాచాలా క్షీణించింది. దీంతో ఇప్పుడు కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాయకత్వంలో ఫిబ్రవరిలో జరిగే తొలి ద్రవ్యసమీక్షలోనైనా వడ్డీరేట్లు తగ్గుతాయని అంతా ఎదురుచూస్తున్నారు’ అని డ్యూషే బ్యాంక్ అనలిస్టులు చెప్పారు. రెండేండ్లపాటు వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచడం చిన్న విషయమేమీ కాదని తాజా నివేదికలో వ్యాఖ్యానించారు.
కాబట్టి రెపోరేటు అరశాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గడం అవసరమన్నారు. గత ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ 1 శాతం మేర వడ్డీరేట్లను తగ్గించిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. కాగా, గత నెల డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.22 శాతానికి తగ్గింది. అంతకుముందు నెల నవంబర్‌లో ఇది 5.48 శాతంగా ఉన్నది. ఇక ఈ ఏడాది జనవరి-జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఇంకా తగ్గి 4.30 శాతానికి రావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించడానికి రూపాయి క్షీణత ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారుతున్నది. సోమవారం దాదాపు రెండేండ్లలో ఎన్నడూలేనంతగా దేశీయ కరెన్సీ పతనమైన విషయం తెలిసిందే. డాలర్‌తో పోల్చితే రూపీ మారకం విలువ ఏకంగా ఆ ఒక్కరోజే 66 పైసలు పడిపోయి 86.70 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో దిగజారుతున్న రూపాయి విలువ.. దిగుమతుల్ని భారం చేసి దేశంలో ద్రవ్యోల్బణాన్ని ఎగదోసే ప్రమాదం కనిపిస్తున్నది. ఇదే జరిగితే ఆర్బీఐ వడ్డీరేట్ల కోతలకు బ్రేకులు పడ్డట్లేనంటున్నారు. ఇక గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 5.4 శాతానికి పరిమితమైంది. ఇది దాదాపు రెండేండ్లలో కనిష్ఠ స్థాయి.
ఈ కోణంలో చూస్తే వృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీరేట్ల కోతలు తప్పనిసరిగా మారుతున్నాయి. మొత్తానికి ఆర్బీఐ ఫిబ్రవరి ద్రవ్యసమీక్షలో ఎలాంటి నిర్ణయం ఉంటుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ముఖ్యంగా ఆటో, రియల్టీ, బ్యాంకింగ్ రంగాల వృద్ధి వడ్డీరేట్లపైనే ఉండటంతో ఆయా రంగాల నుంచి వడ్డీ తగ్గింపుల డిమాండ్ జోరుగా వినిపిస్తున్నది. 2023 ఫిబ్రవరిలో చివరిసారిగా రెపోరేటును ఆర్బీఐ 6.50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ద్రవ్యోల్బణం అదుపు పేరుతో దాన్ని అక్కడే ఉంచింది. దీంతో ఆయా రుణాలపై ఈఎంఐలు రుణగ్రహీతలకు భారంగా పరిణమించాయి. అయితే గత ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ కఠిన వైఖరిని వీడనాడటం కొంత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఫలితంగా రాబోయే సమీక్షల్లో వడ్డీరేట్ల సవరణకు వీలు చిక్కింది.