Import Duties | న్యూఢిల్లీ, జనవరి 15: రోజురోజుకీ పడిపోతున్న రూపాయి విలువను అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సుంకం ఆయుధాన్ని చేపట్టవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి పతనమైన విషయం తెలిసిందే. ఈ నెల 13న ఏకంగా 86.70 స్థాయికి దిగజారింది. ఈ ఒక్కరోజే 66 పైసలు క్షీణించింది. దీంతో రాబోయే బడ్జెట్లో దేశంలోకి వచ్చే దిగుమతులపై పెద్ద ఎత్తున సుంకాల భారాన్ని మోపవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పద్దును ప్రకటించనున్నారు. ఈ సందర్భంగానే డాలర్ల డిమాండ్‌ను అరికట్టడానికి దిగుమతులపై భారీగా సుంకాలను తీసుకురావచ్చని ప్రముఖ ఆర్థికవేత్త డీకే శ్రీవాత్సవ అంటున్నారు. 16వ ఆర్థిక సంఘం సలహా మండలిలో సభ్యుడు కూడా అయిన శ్రీవాత్సవ పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దిగుమతులపై అధిక సుంకాలను వేయడం వల్ల దిగుమతిదారుల నుంచి డాలర్ల డిమాండ్‌కు కళ్లెం వేయవచ్చని, రూపాయి విలువ పతనాన్నీ నివారించవచ్చని మోదీ సర్కారు యోచిస్తున్నట్టు చెప్పారు.
గతకొద్ది రోజులుగా అంతకంతకూ క్షీణిస్తున్న రూపీ ఎక్సేంజ్ రేటు.. దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగానే పరిణమిస్తున్నది. రూపాయి విలువ పతనం.. ఇటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలపై, అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధానాలపైనా ప్రభావం చూపుతుందని శ్రీవాత్సవ చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రూపాయి బలోపేతమే లక్ష్యంగా సర్కారు, సెంట్రల్ బ్యాంకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నట్టు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగానే వచ్చే బడ్జెట్లో ఆయా దిగుమతులపై సుంకాలను పెంచే వీలుందన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మున్ముందు ఇంకా పుంజుకుంటుందన్న అంచనాలున్నాయన్న ఆయన.. సమీప భవిష్యత్తులో రూపాయి మరింత బలహీనపడకుండా జాగ్రత్తపడాల్సి ఉందన్నారు.
కొనుగోలుదారుల వినీమయ శక్తిని పెంపొందించడానికి బడ్జెట్లో దిగువశ్రేణి ఐటీ శ్లాబులను సవరించాలని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చెప్తున్నది. ద్రవ్యోల్బణం అందరి ఆదాయాన్నీ మింగేస్తున్నదని, కాబట్టి పన్ను ఊరట ఇప్పుడు తప్పనిసరిగా అభిప్రాయపడింది. అప్పుడే మార్కెట్లోనూ కొత్త ఉత్సాహం వస్తుందన్నది. ఇదిలావుంటే సరసమైన ధరల్లో లభించే హౌజింగ్ ప్రాజెక్టులపై ఆదాయ పన్నును 15 శాతం శ్రేణిలోనే ఉంచాలని క్రెడాయ్ కేంద్రానికి సూచించింది.