Hindenburg Research | హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research).. ఇది అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌పై (Adani Group) హిండెన్‌బర్గ్ నివేదిక ఏ స్థాయిలో ప్రకంపనల్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ కార్పొరేట్ వర్గాల నుంచి రాజకీయ రంగందాకా ఈ అంశం కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ దెబ్బకి అదానీ షేర్లు కుదేలయ్యాయి. ఈ సంస్థ రిపోర్ట్ భారత స్టాక్ మార్కెట్లను కూడా వణికించింది. అయితే, తాజాగా ఈ సంస్థ సంచలన నిర్ణయం ప్రకటించింది.
కంపెనీ కార్యలాపాలను మూసివేస్తున్నట్లు (Hindenburg Research shut down) సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ (Nathan Anderson) తాజాగా ప్రకటించారు. సంస్థ మూసివేత గురించి కొంతకాలంగా తన ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించినట్లు చెప్పారు. అనేక చర్చల తర్వాత సంస్థను మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలూ లేవని స్పష్టం చేశారు. తమ ప్రణాళికలు, ఐడియాలు ముగియడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు.
‘హిండెన్ బర్గ్ నా జీవితంలో ఓ అధ్యాయం మాత్రమే. సంస్థ స్థాపించినప్పుడు నన్ను నేను నిరూపించుకునేందుకు ఎంతో కష్టపడేవాడిని. అయితే ఇప్పుడు నేను కంఫర్ట్ జోన్లో ఉన్నానని అనిపిస్తోంది. ఈ సంస్థ వల్ల ఎంతో సాహసం చేశాను. ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నా. అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా పనిచేశా. ఇదంతా నాకో ప్రేమ కథలా అనిపిస్తోంది. ఇకపై నా భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతాను’ అని నాథన్ అండర్సన్ పేర్కొన్నారు.
రెండేళ్ల క్రితం అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్‌పై 106 పేజీల రిపోర్టును రిలీజ్ చేసింది. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతున్నదని, స్టాక్ మార్కెట్లలో గ్రూప్ కంపెనీల షేర్ల విలువ పెరిగేలా అక్రమాలకు దిగుతున్నదని సంచలన ఆరోపణలు చేసింది. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా రూ.12 లక్షల కోట్లు హరించుకుపోయింది. అదానీ సంస్థల్లో ఆయా కంపెనీల పెట్టుబడులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ కొన్న వాటాలపై పెద్ద ఎత్తున దుమారం రేగినది విదితమే. చివరకు అదానీ వ్యాపార విస్తరణకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సహకరించిందని, దీనిపై లోతుగా దర్యాప్తు జరుగాలని పార్లమెంట్లో విపక్షాలన్నీ పట్టుబట్టినదీ తెలిసిందే.
Also Read..
Enforcement Directorate | బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల అరెస్ట్
Body Exhumed: కేరళలో పూజారి సజీవ సమాధి.. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు