అంకం సంతోష్ : దేశ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్లో పడిందా? ఆ విషయం గ్రహించే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపునిచ్చారా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయిప్పుడు. వాస్తవ పరిస్థితులూ అందుకు అద్దం పడుతుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో అధికారికంగా ప్రకటించిన హోల్‌సేల్, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు కావచ్చు.. గత నెలకుగాను విడుదలైన ప్రభుత్వ ఆర్థిక నివేదికైనాసరే.. ఇటీవల తీసుకున్న సుంకాల పెంపు, పెట్రో ధరల వడ్డన నిర్ణయాలుగానీ అన్నీ సంక్షోభం ముంగిట ఉన్నామనే స్పష్టం చేస్తున్నాయి మరి. నిజానికి పశ్చిమాసియా సంక్షోభంతో భారత ఆర్థిక వ్యవస్థ ఢీలా పడిందని చెప్పుకొస్తున్నా.. అంతకుముందు నుంచే బలహీనపడిందని, దానికి మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు తోడయ్యాయన్న అభిప్రాయాలు మెజారిటీ ఆర్థిక నిపుణుల విశ్లేషణగా ఉండటం ఒకింత కలవరపెడుతున్నది.
పశ్చిమాసియా యుద్ధం.. కేవలం గల్ఫ్ దేశాలనేగాక, యావత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేస్తున్నది. 3 నెలలుగా సాగుతున్న ఈ పోరు.. ఇప్పుడప్పుడే తగ్గేటట్టు కనిపించట్లేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విజృంభిస్తున్నాయి. ఆ ప్రభావం భారత్‌లోనూ కనిపిస్తున్నది. మే 15 నుంచి 11 రోజుల్లో నాలుగుసార్లు ఇంధన రేట్లను చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచాయి. బంకుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.8 చొప్పున పెరిగాయి. ఇక సీఎన్జీ ధర రూ.4, ఎల్పీజీ రేటు రూ.60 పెరిగాయి. ఇంకా లీటర్ పెట్రోల్ అమ్మకంపై రూ.7, డీజిల్‌పై రూ.10, వంటగ్యాస్‌పై దాదాపు రూ.400 నష్టపోతున్నాయన్నది అంచనా. దీంతో మున్ముందు మరిన్ని పెంపులు ఖాయమనే చెప్పవచ్చు.
ద్రవ్యోల్బణం గణాంకాలు దౌడు తీస్తున్నాయి. ఏప్రిల్కుగాను రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతంగా నమోదైంది. ఇక టోకు ద్రవ్యోల్బణం 8.3 శాతంగా తేలింది. పెట్రో ఉత్పత్తులు సహా, వంటనూనెలు, పప్పుధాన్యాలు, మాంసం, గుడ్లు, చేపలు, కూరగాయలు, పండ్లు ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వినియోగదారులు మండిపడుతున్నారు. దీంతో అదుపు తప్పిన ద్రవ్యోల్బణాన్ని దారిలో పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ రెపోరేటును పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచేస్తాయి. ఫలితంగా రుణ లభ్యత కరువై వ్యాపార, పారిశ్రామిక రంగాలు దెబ్బతింటాయని, ఉపాధి కుంటుపడే ప్రమాదం ఉన్నదని మార్కెట్ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. చివరకు దేశ జీడీపీపై ప్రభావం పడుతుందని అంటున్నారు.
పెరిగే ఇంధన ధరలు.. ఆయా దేశీయ పరిశ్రమల లాభాలను మింగేస్తున్నాయి. పెట్రో ఆధారిత రంగాలైన విమానయానం, పర్యాటకం, ఆతిథ్య, ఆటో, లాజిస్టిక్స్, పెయింట్స్, రసాయనాలు, ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికే కుదేలైన పరిస్థితి. ఇక బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీగా సుంకం, సెస్సులను పెంచిన విషయం తెలిసిందే. ఏకంగా 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పొదుపు మంత్రంలో భాగంగా కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలంటూ దేశ ప్రజలకు హైదరాబాద్‌లో జరిగిన సభ నుంచి పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.. ఢిల్లీకి వెళ్లగానే అందుకు ప్రభుత్వం తరఫున ఏం చేయాలో అది చేసేశారు. విదేశాల నుంచి దేశంలోకి దిగుమతైన బంగారం, వెండిపై 15 శాతం (కనీస కస్టమ్స్ సుంకం 10 శాతం, వ్యవసాయ మౌలికాభివృద్ధి సెస్సు 5 శాతం) సుంకం వేశారు. మొత్తంగా పన్నుల భారం 18.45 శాతానికి చేరిందిప్పుడు. మునుపు ఇది 9.18 శాతంగానే ఉండటం గమనార్హం. దీంతో జ్యువెల్లర్స్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
తమ రత్నాలు, ఆభరణాల పరిశ్రమపై ఆధారపడి దేశవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది జీవిస్తున్నారని, వీరంతా రోడ్డునపడే దుస్థితి వస్తున్నదంటూ జ్యువెల్లర్స్ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగిత రేటు దాదాపు 6-6.5 శాతం స్థాయిలో కదలాడుతున్నది. ముఖ్యంగా యువతలో నిరుద్యోగం ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. ఏ రంగంలో చూసినా వ్యయ నియంత్రణ చర్యలే కనిపిస్తున్నాయి. దీంతో నియామకాలు అటకెక్కుతున్నాయి.
సరైన ఉపాధి అవకాశాలు ఎక్కడా లభించడం లేదు. ఇప్పటికే తగ్గిన విదేశీ ప్రాజెక్టులు, ఏఐ వినియోగంతో ఐటీ రంగాన్ని భయాలు ఆవరించాయి. చాలా కంపెనీలు లేఆఫ్‌లకు దిగుతుండటాన్ని చూస్తూనే ఉన్నాం. ఇక తయారీ రంగంలో మందగమనం ఛాయలు స్పష్టంగా కనిపిస్తుండటంతో అటు సంఘటిత, ఇటు అసంఘటిత రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల క్షీణతను సూచిస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే జనాభాపరంగా అగ్రస్థానంలో ఉన్న భారత్‌లో అలజడులేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

దేశ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉంటుండటంతో వాణిజ్య లోటు పెరిగిపోతున్నది. అంతేగాక ఫారెక్స్ నిల్వలు తరిగిపోతున్నాయి. ముఖ్యంగా వార్ మొదలైన దగ్గర్నుంచి వేగంగా క్షీణిస్తున్నాయి. యుద్ధం మొదలవకముందు 728.494 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫారెక్స్ నిల్వలు.. ఇప్పుడు 681.384 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దాదాపు గడిచిన 3 నెలల కాలంలో 47.11 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి. విదేశీ లావాదేవీలన్నీ అమెరికా డాలర్లలోనే ఎక్కువ శాతం జరుగుతాయి. అవి తగ్గిపోతుండటం కలవరపెడుతున్నది. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సైతం మిక్కిలి ఆందోళన కలిగిస్తున్నది. ఈ నెల 20న ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ 96.86గా నమోదైంది. ఒకానొక దశలోనైతే 96.95కు వెళ్లడం గమనార్హం.

దేశంలో నెలకొన్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ప్రతికూల విధానాల వల్లే తలెత్తాయి. మెజారిటీ సామాన్య ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు కాకుండా.. అదానీ, అంబానీ వంటి కొద్దిపాటి కార్పొరేట్లకు మేలు చేకూర్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. నిజానికి పశ్చిమాసియాలో సంక్షోభం రాకముందే దేశ ప్రజానీకం ఆదాయం పడిపోయింది. అయినప్పటికీ మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్న దురభిప్రాయాన్ని సర్కార్ వ్యాపింపజేసింది. ఉదాహరణకు ద్రవ్యోల్బణం గత అనేక సంవత్సరాలుగా పెరుగుతున్నది. ఇప్పుడు ఇంకా వేగంగా పెరుగుతున్నదంతే. అలాగే విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులను వెనుకకు తీసుకుంటుండటం ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. గత ఏడాదిన్నరగా భారతీయ స్టాక్ మార్కెట్లలో పతనం ఉన్నది. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కూడా ఈమధ్య నుంచే నష్టపోవడం లేదు.
దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లోనూ క్షీణత ఎప్పట్నుంచో కనిపిస్తున్నది. అయితే విదేశాల్లో భారతీయులు పెట్టే పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇది దేశంలో తగ్గిపోయిన డిమాండ్‌ను, క్షీణించిన కొనుగోలు శక్తికి అద్దం పడుతున్నది. నిరుద్యోగం, ధరలు పెరుగడం.. ప్రజల ఆర్థిక సామర్థ్యం పడిపోవడం వంటివి దేశ ఆర్థిక ప్రగతికి అవరోధాలుగా మారుతున్నాయి. చివరకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా మోదీ సర్కార్ నిర్వీర్యం చేసింది. అనేక సంక్షేమ పథకాలను తెచ్చినా.. అవి పేరుకు మాత్రమే ఉన్నాయి. వాటివల్ల ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదు. ఉజ్వల పథకాన్నే చూసినైట్టెతే సబ్సిడీ కింద మొదటిసారి ఫ్రీ గ్యాస్ ఇచ్చి వదిలేశారు. ఆ తర్వాత పెరిగిన గ్యాస్ ధరలతో లబ్ధిదారులు మార్కెట్ రేటుకే కొనుక్కోవాల్సి వస్తున్నది. అంత రేటు చెల్లించలేక చాలామంది గ్రామాల్లో మళ్లీ కట్టెల పొయ్యిల్నే వాడాల్సిన దుస్థితి నెలకొన్నది.
రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన రైతుబంధును చూసి పీఎం కిసాన్‌ను కేంద్రం తీసుకొచ్చింది. అయితే ఏటా రైతుల సంఖ్య పెరుగుతూ రైతుబంధు పథకం విస్తరిస్తే.. పీఎం కిసాన్‌లో లబ్ధిదారులు క్రమేణా తగ్గిపోతూ వస్తున్నారు. కేసీఆర్ హయాంలో టంఛన్‌గా రైతులకు పెట్టుబడి సాయం అందేది. నాడు రూ.75వేల కోట్లను టైమ్ టు టైమ్ ఇచ్చారు. కానీ పీఎం కిసాన్‌లో ఆ పరిస్థితి లేదు. పథకాలను మొదట్లో ఆడంబరంగా ప్రకటించి, ఆ తర్వాత వాటి అమలును మోదీ సర్కార్ విస్మరిస్తున్నది. అలాగే దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నామని చెప్పుకొంటూనే.. మరోవైపు పేదరికం తగ్గిందని గప్పాలు కొట్టుకుంటున్నారు. మెజారిటీ జనాభాకు ఉచిత బియ్యం అందుతుంటే పేదరికం తగ్గిందో లేక పెరిగిందో కేంద్రంలోని పెద్దలకే తెలియాలి.
గతంలో సంపద పన్ను ను ఎత్తేయడం, కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించడం వల్ల ఖజానాకు లక్షల కోట్ల రూపాయల ఆదాయం దూరమైంది. అర్హులైనవారికి సబ్సిడీలు, సాయాల్లో కోతలు పెట్టి కూడబెడుతున్న ధనం, సర్కారీ బ్యాంకుల్లో రైటాఫ్‌ల పేరిట రద్దవుతున్న కోట్ల రూపాయల రుణాల సొమ్ము అంతా చివరికి చేరుతున్నది కార్పొరేట్లకే. అందుకే ఇది కార్పొరేట్ల ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే పడిపోయిన దేశ ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి, పోతున్న ఉద్యోగాలవల్ల ఏర్పడిన సంక్షోభమే ఇది. దీనివల్లే పశ్చిమాసియా సంక్షోభం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అయినప్పటికీ మోదీ తన తప్పుడు విధానాలను మార్చుకోకుండా.. ప్రజలకు పొదుపు పాఠాలు చెప్తుండటం హాస్యాస్పదం.
– డీ పాపారావు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు
భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలంగానే ఉన్నది. కానీ అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ముదురుతున్నకొద్దీ ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సిందే. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ముడి చమురు, గ్యాస్, ఎరువులు, పారిశ్రామిక ముడి ఉత్పత్తుల సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. పెరిగే ధరలు, తరిగే వాణిజ్యంతో సమస్యే. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) భారత్‌పై అంతర్జాతీయ అలజడుల ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చు. గల్ఫ్‌లో పరిస్థితులు చక్కబడేదాకా దేశ జీడీపీ గణాంకాలపై ఆ ప్రభావం కనిపించవచ్చు.
-ప్రభుత్వ ఆర్థిక నివేదిక
భారత్‌కు ‘బిగ్ షాక్’ తగులబోతున్నది. భయానక పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశీయ పరిశ్రమ సిద్ధంగా ఉండాలి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోల దశలోకి వచ్చింది. ఇండస్ట్రీ వర్గాలు, విధానకర్తలు ఆ ఒడిదుడుకులను అధిగమించేందుకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉన్నది. మన దేశంపై యుద్ధ ప్రభావం విషయంలో గడిచిన కాలాన్ని గ్రేస్ పీరియడ్గానే చూడవచ్చు. దాదాపు 3 నెలలుగా జరుగుతున్న యుద్ధం ప్రభావాన్ని మనం ఇప్పటిదాకా చూడలేదు మరి. ఇకపై చూడబోతున్నాం. అమెరికా-ఇరాన్ పోరు ఆగకపోతే.. ఆపై విపత్కర పరిణామాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు.
-ఉదయ్ కొటక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపక డైరెక్టర్
దేశ ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా సంఘర్షణల వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాలు కనిపించడం మొదలైంది. ఇక అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయి. దిగుమతుల వ్యయం కూడా అంతకంతకూ పెరుగుతూపోతుంది. గల్ఫ్ దేశాల్లో ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తికి బ్రేకులు పడటం, హొర్ముజ్ జలసంధిలో రాకపోకలు నిలిచిపోవడం.. భారత్‌కు పెద్ద దెబ్బ. పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ లేక ఎగుమతులు నీరసిస్తుంటే.. యుద్ధంతో దిగుమతులు ఖరీదెక్కుతుండటం భారత్‌ను ఇరకాటంలో పడేస్తున్నాయి.
-క్రిసిల్ ఇంటెలిజెన్స్ ఇటీవలి నివేదిక
ఓవైపు భయంకర ఆర్థిక తుఫాను మనల్ని ముంచేయబోతున్నది. మరోవైపు మన ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలు చేస్తూ అక్కడ చాక్లెట్లు పంచే పనిలో తీరిక లేకుండా గడిపారు. దేశంలో రైతులు, యువత, మహిళలు, కార్మికులు, చిరు వ్యాపారులు ఏడుస్తుంటే.. ప్రధాని మోదీ మాత్రం నవ్వుతూ రీల్స్ తీసుకున్నారు. దానికి బీజేపీ నేతలు చప్పట్లు కొట్టి సంబురపడిపోతున్నారు. రాబోయే సంక్షోభం నుంచి దేశాన్ని ఈ ప్రభుత్వం రక్షించలేదు. వచ్చే 2-3 నెలల్లో ఆ ప్రభావమేంటో అందరికీ తెలుస్తుంది. ఆర్థిక వ్యవస్థను బలపర్చాల్సి ఉన్నది.
-రాహుల్ గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు