న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశీయ ఆతిథ్య రంగానికి పెండ్లి కళ వచ్చింది. ఇన్నాళ్లూ విదేశాల్లో వెడ్డింగ్స్‌కు ఆసక్తి కనబర్చిన భారతీయులు.. ఇటీవలికాలంలో స్వదేశంలోనే దండలు మార్చుకునేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లకు గిరాకీ పెరిగింది. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలోనే ఆదాయం రావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ వంటి డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్స్‌కు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తున్నదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా, రాడిసన్ హోటల్ గ్రూప్ భారతీయ పోర్ట్‌ఫోలియో గత నెలలో నిరుడుతో పోల్చితే 87.1 శాతం ఎక్కువగా ఆదాయాన్ని ప్రకటించింది. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ హోటళ్లకు ఆదరణ పెరుగుతుండగా.. ఐటీసీ హోటల్స్ దీన్ని అందిపుచ్చుకుంటున్నది. జైపూర్, ఉదయ్‌పూర్, గోవా, కేరళ, తిరుపతితోపాటు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లలో గతంతో పోల్చితే ఈ ఏడాది హోటళ్లకు పెండ్లిళ్ల గిరాకీ పెరిగిందని గణాంకాలను చూస్తే స్పష్టంగా తెలుస్తున్నది. లగ్జరీ వెడ్డింగ్ వేడుకల్లో కనీస ఖర్చు రూ.90 లక్షల నుంచి రూ.1.3 కోట్లుగా ఉందని హోటళ్ల యాజమాన్యాలు చెప్తున్నాయి.